ప్రేంసాగర్ వర్సెస్ వివేక్.. మధ్యలోఅరవిందరెడ్డి | Fighting between two main leaders | Sakshi
Sakshi News home page

ప్రేంసాగర్ వర్సెస్ వివేక్.. మధ్యలోఅరవిందరెడ్డి

Apr 17 2014 4:04 AM | Updated on Aug 29 2018 8:54 PM

కాంగ్రెస్ పార్టీ తూర్పు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గ్రూపు విభేదాలకు నిలయమైన ఆ పార్టీలో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తూర్పు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గ్రూపు విభేదాలకు నిలయమైన ఆ  పార్టీలో ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది. ఈ నేతల మధ్య పోరు ప్రభావం ఆ పార్టీ మరో అభ్యర్థిపై కూడా పడుతోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపుల్లో చక్రం తిప్పిన ప్రేంసాగర్‌రావుకు, ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వివేక్ మధ్య విభేదాలున్నాయి.

 ఇద్దరు కూడా బలమైన నేతలు కావడంతో ఈ పోరు రసకందాయంలో పడింది. పెద్దపల్లి ఎంపీ లోక్‌సభ స్థానం పరిధిలో వచ్చే మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో ఇరువర్గాల అనుచరులు ఎవరికివారే అన్న చందంగా తయారయ్యారు. ప్రేంసాగర్‌రావు వర్గీయుల సహకారం వివేక్‌కు అందడం లేదు. ముఖ్యంగా బెల్లంపల్లిలో ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేక్ ఈ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. ప్రేంసాగర్‌రావు వర్గీయులు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌పై రెబల్‌గా బరిలోకి దిగిన చిలుముల శంకర్ ప్రేంసాగర్‌రావు వర్గీయుడు.

 ఆయన్ను ప్రేంసాగర్‌రావే బరిలో నిలిపారని సీపీఐ ముఖ్య నాయకులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.మహేందర్‌రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింగరావు, మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్‌కుమార్ తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరంతా ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి వివేక్ ప్రచారానికి దూరంగా ఉండటం స్థానికంగా చర్చనీయాంశ మవుతోంది. మరో విశేషమేమంటే వీరు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి చిలుముల శంకర్‌కు మద్దతుగా పని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో మండలానికి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పీసీసీ కార్యదర్శి, మున్సిపల్ మాజీ ైచైర్మన్ సూరిబాబు వర్గం మాత్రమే వివేక్‌కు అండగా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ప్రేంసాగర్‌రావు వర్గీయుడైన రేగాల మధుసూదన్‌ను వివేక్ తనవైపు తిప్పుకోగలిగారు.

 మంచిర్యాలలో..
 మంచిర్యాల టిక్కెట్ కోసం ప్రేంసాగర్‌రావు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయడంతో అరవిందరెడ్డి పరిస్థితి అప్పట్లో ఆగమ్యగోచరంగా తయారైంది. కానీ అధిష్టానం మాత్రం ప్రేంసాగర్‌రావును సిర్పూర్‌కు పంపి, అరవిందరెడ్డికి మంచిర్యాల టిక్కెట్‌ను ఖరారు చేసిన విషయం విధితమే. అయితే ఇక్కడి టిక్కెట్ ఆశించిన ప్రేంసాగర్‌రావుకు మంచి ర్యాలలో అనుచరవర్గం ఉంది. ఈ వర్గం ఎన్నికల్లో అరవిందరెడ్డికి సహకరించడం లేదు. మంచిర్యాలకు చెందిన ఈ నాయకులంతా అరవిందరెడ్డికి ప్రచారం చేయకుండా, సిర్పూర్ వెళ్లి వారి నాయకునికి ప్రచారం చేస్తున్నారు.

మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల దయానంద్, మంచిర్యాల మండల శాఖ పార్టీ అధ్యక్షుడు సుంకి సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు తదితరులు ప్రేంసాగర్‌రావు అనుచరులు. వీరు తమ సొంత నియోజకవర్గంలో కాకుండా, సిర్పూర్ వెళ్లి ప్రచారం నిర్వహించడం అరవిందరెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకరిద్దరు నాయకులు సహకరించక పోయినా పెద్దగా నష్టమేమి ఉండదని ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. వివేక్, అరవిందరెడ్డిలు మాత్రం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ వర్గపోరు ఎటువైపు దారితీస్తుందోనని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement