స్వతంత్రులతో పరేషాన్ మోపైంది. ఎంత బుజ్జగించినా వారు బరి నుంచి తప్పుకోకపోవడంతో ఓట్లు చీలుతాయేమోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెల కొంది.
పార్టీల అభ్యర్థులకు తలనొప్పిగా మారిన స్వతంత్రులు
పోటీలో ఈసారి మరింత ఎక్కువ మంది
ఓట్లు చీలుతాయేమోనని ఆందోళన
గుర్తులతో ఓటర్లకు పరేషన్
స్వతంత్రులతో పరేషాన్ మోపైంది. ఎంత బుజ్జగించినా వారు బరి నుంచి తప్పుకోకపోవడంతో ఓట్లు చీలుతాయేమోనన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెల కొంది. ప్రధానంగా టీఆర్‌ఎస్ కారు గుర్తును పోలి ఉండే బస్సు, ఆటో రిక్షా గుర్తులొచ్చే స్వతంత్రులు తమ ఓట్లకు గండి కొడుతారని మదనపడుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఇది నిజమేనని భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలుపొందిన నేతలకు స్వతంత్రులు చీల్చిన ఓట్లే కలిసొచ్చాయి.ఇప్పుడు కూడా ఆయా సెగ్మెంట్లలో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడం ప్రధాన పార్టీల నేతల్లో దిగులుకు కారణమైంది.
153 మందిలో 53 మంది స్వతంత్రులు
జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 153 మంది పోటీ చేస్తుండగా... వీరిలో 53 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నా రు. ఇక రెండు ఎంపీ స్థానాల్లో 29 మంది బరిలో నిలవగా 13 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. అత్యధికంగా మహబూబాబాద్ పార్లమెంట్‌లో పది మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలవడం విశేషం. అసెంబ్లీ స్థానాలు జనగామ, నర్సంపేట, పాలకుర్తి, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, ములుగు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు.
గుర్తులతోనే ఇబ్బంది
ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రమాదం వాటిల్లుతోంది. అంతేకాకుండా కొన్నిచోట్ల స్వతంత్రులకు వేలల్లో ఓట్లు పడడం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారణమవుతోంది. బస్సు, ఆటో రిక్షా వంటి గుర్తులు పోల్చుకోలేని నిరక్షరాస్యులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే వేయాల్సిన ఓట్లను ఈ గుర్తులపై వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ప్రతీసారి స్వతంత్రులను బుజ్జగించి పోటీ నుంచే తప్పించే ప్రయత్నాలు చేస్తున్నా వారిలో కొందరు ససేమిరా అంటున్నారు. ఈసారి కూడా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 53 మంది స్వతంత్రులు పోటీలో ఉండడం.. ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో వివరాలు...
నియోజకవర్గం గెలిచినఅభ్యర్థి మెజార్టీ స్వతంత్రులకు వచ్చిన ఓట్లు
జనగామ 236 9,210
స్టేషన్ ఘన్‌పూర్ 11,210 11,234
పాలకుర్తి 2,663 9,782
డోర్నకల్ 4,623 4,140
మహబూబాబాద్ 15,367 10,654
నర్సంపేట 8,623 6,094
పరకాల 12,800 10,315
వరంగల్ పశ్చిమ 6,684 6,397
వరంగల్ తూర్పు 7,255 7,344
వర్ధన్నపేట 6,584 10,487
భూపాలపల్లి 11,972 12,576
ములుగు 18,775 17,876