రాబోయే రెండు నెలలు అందరికీ పరీక్షల కాలమే. సామాన్యుడి నుంచి నాయకుల వరకు, విద్యార్థి నుంచి ఓటరు వరకు అందరికీ పరీక్షలే పరీక్షలే.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
రాబోయే రెండు నెలలు అందరికీ పరీక్షల కాలమే. సామాన్యుడి నుంచి నాయకుల వరకు, విద్యార్థి నుంచి ఓటరు వరకు అందరికీ పరీక్షలే పరీక్షలే. ఓ వైపు టెన్‌త పరీక్షలు దగ్గరపడడంతో విద్యార్థులు హైరానా పడుతున్నారు. మరోవైపు మున్సిపల్ మొదలుకుని అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తుండడంతో నాయకులు హడావుడి చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యా ప్రజలూ పరీక్షలు ఎదుర్కొంటున్నారు.
ఈ నెల 27 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. జిల్లాలో 30,648 మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను పరీక్షించుకోనున్నారు. ఉక్కపోత, కరెంటు కోతకు తోడు టీ20 వరల్డ్ కప్ క్రికెట్‌ల వేడిని సైతం పక్కకుపెట్టి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఇంకొకవైపు నేతలు మున్సిపల్ సమరానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో స్థానిక ఎన్నికలకూ గ్రౌండ్ వర్‌క చేస్తున్నారు. దీంతో పాటు అతిపెద్ద సార్వత్రిక యుద్ధానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా నాయకులు కష్టపడుతున్నారు.
ఎలచ్చన్లు...
జిల్లాలో ప్రస్తుతం నాలుగు మున్సిపాల్టీల్లో 129 కౌన్సిలర్ స్థానాలకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా తదితర పార్టీల అభ్యర్థులు కూడా తామేమీ తక్కువ కాదంటున్నారు.
మున్సిపోల్స్ తర్వాత జరిగే 549 ఎంపీటీసీ స్థానాలకు, 34 జెడ్పీటీసీ స్థానాలకు రాజకీయ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి.
దీంతో మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల కోసం కార్యకర్తలు, నాయకులు రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. మేలో జరిగే తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం ఎన్నికలకు ఆశావహులు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఎవరికి టికెట్లు దక్కుతాయో ఎవరికి దక్కవోనని ఆందోళన చెందుతున్నారు. టిక్కెట్ల వేట కూడా పరీక్షా కాలంగా తయారైంది.
ప్రజలకు కూడా...
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు దంచేస్తున్నాయి. ఇప్పుడే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. దీనికి తోడు కరెంటు కోతలు ప్రజలకు పరీక్ష పెడుతున్నాయి. దీనికి తోడు పిల్లలను పరీక్షలకు సిద్ధం చేయడం.
నాయకుల వెనుక తిరగడం కూడా వీరికి పరీక్షే. ప్రస్తుతం ఆర్థిక స్థోమత ఉన్న వారు ఏసీ, కూలర్లు తదితర సౌకర్యాలతో ఉపశమనం పొందుతున్నా సామాన్య ప్రజల కు మాత్రం అవస్థలు తీరడం లేదు. ఇక అప్రకటిత కోతలతో మరింత ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సందట్లో సడేమియాలా ఇప్పుడీ ఎన్నికల ప్రచారాలతో నాయకులు చెవులను హోరె త్తిస్తున్నారు.