తిరువళ్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: తిరువళ్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్లమెంటు ఎన్నికలు గురువారం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యాయి.
గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలోని పూండి, పెరియపాలెం, గుమ్మిడిపూండిలో 17 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 11.30 గంటలకు దాదాపు 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అలాగే పెరియపాలెంలోని నైవేలి గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో వేసిన ఓట్లన్నీ అధికార పార్టీకి పడుతుండడంతో ఓటర్లు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ ఆపి మరో మిషన్‌తో పోలింగ్ నిర్వహించారు.
నొచ్చికుప్పం, ఆరంబాక్కం, చిన్నంబేడు జాలర్లు తమపై జరిగిన దాడిలో అధికార పార్టీ నిర్లక్ష్యం చేసిందని, మూడు గ్రామాల జాలర్లు ఓటు వేసేందుకు రాలేదు. కనీసం ఏజెంట్లు సైతం పోలింగ్ బూత్‌కు రాలేదు. అధికారులు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సమాచారం అందించడంతో ఆయన ఆదేశానుసారంగా గుమ్మిడిపూండి తహశీల్దారు శంకరి వచ్చి గ్రామస్తులతో చర్చించారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 16 మంది యువకులు మాత్రం వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుమ్మిడిపూండి బజారు వీధిలోని ఏఎల్‌కే ప్రభుత్వ మహోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సీహెచ్.
శేఖర్, ఆయన సతీమణి మయూరి వచ్చి ఓటు వేశారు. మొత్తం మీద గుమ్మిడిపూండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.