చెట్లు కూలుతున్న దృశ్యం

Worlds Most Polluted 15 Cities in India - Sakshi

వాయు కాలుష్య భూతం జనం ఊపిరి తీస్తున్నదని మొన్నీమధ్యే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక వెల్లడించిన సంగతి విస్మరించి దేశ రాజధాని నగరంలో మహా వృక్షాలను నేల కూల్చడానికి బయల్దేరిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకోవటం పర్యావరణవాదులకు సంతృప్తినిస్తుంది. ప్రపంచంలోని అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో భారత్‌కు చెందిన 14 నగరాలున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తెలిపింది. అడవుల విధ్వంసం కారణంగా పరిశ్రమలు, వాహనాలు విడిచిపెట్టే కాలుష్యం అడ్డూ ఆపూ లేకుండా పీల్చే గాలిలోనూ, తాగే నీటిలోనూ కలుస్తున్నదని... అది ఏటా లక్షలమంది చావుకు కారణమవుతున్నదని వివరిం చింది. ఇటీవలికాలంలో ఢిల్లీ నగరంపై అరడజనుసార్లు ధూళి తుపాను విరుచుకుపడింది. విస్తారంగా చెట్లుంటే ఇలాంటి విపత్తుల బెడద ఉండదని పర్యావరణవేత్తలు చెప్పారు. అయినా మన పాలకులకు నదురూ బెదురూ లేదు. వన విధ్వంసంతో తప్ప అభివృద్ధి అసాధ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తామే నేరుగా రంగంలోకి దిగితే తప్ప వ్యవహారం చక్కబడదని గుర్తించిన హరిత కార్యకర్తలు, పౌర బృందాలు, కాలనీ వాసుల సంక్షేమ సంఘాలు ఉమ్మడిగా నిరసనకు దిగిన తీరు దేశ ప్రజలందరికీ ఆదర్శనీయం. ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ల వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పంచుకుని వందలాదిమంది ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 70వ దశకంలో హిమాలయ పర్వత సానువుల్లో అడవుల నరికివేతను నిరసిస్తూ సాగిన చిప్కో ఉద్యమాన్ని గుర్తుకు తెస్తూ ఢిల్లీ వాసులు వృక్షాలను హత్తుకుని వాటి ఉసురు తీయనివ్వబోమని ప్రకటించారు. నిజానికి ఢిల్లీలో వృక్షాల కూల్చివేత పర్యవసానంగా పర్యావరణం దెబ్బతింటుందని, దీన్ని వెనువెంటనే నిలుపుదల చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్‌పై వచ్చే నెల 2న విచారణ జరగబోతోంది. అయినా అధికార యంత్రాంగం తన దోవన తాను వన విధ్వంసాన్ని కొనసాగించింది. కనుకనే ఉద్యమకారులు ఆందోళనకు దిగడంతోపాటు హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది.

దక్షిణ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏడు నివాస సముదాయాలను నవీకరించేందుకు రూ. 33,000 కోట్ల వ్యయంతో చేపట్టబోయే నిర్మాణాల కోసం ఈ ధ్వంసరచనకు అంకురార్పణ చేశారు. కూల్చబోయే వృక్షాలు 14,000కు మించవని అధికారులు చెబుతున్న లెక్కల్ని పర్యావరణ ఉద్యమకారులు అంగీకరించడం లేదు. ఆ ప్రాంతంలోని 16,500 వృక్షాలు కనుమరుగవుతాయని వివరిస్తున్నారు. ఇందులో ఇప్పటికే నౌరోజీనగర్‌లోని 3,780 చెట్లను కూల్చడానికి అనుమతులు మంజూరయ్యాయి. అక్కడ 1,500 చెట్లు రెక్కలు తెగిన పక్షుల్లా నేలరాలాయి. మిగిలిన ప్రాంతాల వృక్షాలకు సంబంధించిన ప్రక్రియ నడుస్తోంది. కూల్చిన ప్రతి చెట్టుకూ బదులు 10 మొక్కలు నాటాలని రెండేళ్లక్రితం అమల్లోకొచ్చిన అటవీకరణ పరిహార నిధి చట్టం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే మొక్కల కోసం అటవీ శాఖకు రూ. 23 కోట్లు అందజేశామని జాతీయ భవన నిర్మాణ సంస్థ (ఎన్‌బీసీసీసీ) ఇస్తున్న సంజాయిషీ ఎవరినీ సంతృప్తిపరచదు. మహా వృక్షాలను పెకిలించినప్పుడు అందుకు పాపపరిహారార్థం మొక్కలు పెంచితే సరిపోతుందని ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ అనుకోలేరు. పైగా మన ప్రభుత్వాలు మొక్కల పెంపకం నిర్వాకం ఎలా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. 2014–17 మధ్య 36,57,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా 28,12,000 మాత్రమే నాటారని ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా అటవీకరణకు సంబంధించినంతవరకూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీ బాగా వెనకబడి ఉంది. 

నిరుడు విడుదలైన అటవీ స్థితిగతుల నివేదిక–2017 ప్రకారం 2015–17 మధ్య దేశంలో కొత్తగా 0.21 శాతం ప్రాంతంలో అడవి విస్తరించింది. కానీ వేరే దేశాల ప్రగతితో పోలిస్తే ఇది అతి స్వల్పం. మన దేశంలోని మొత్తం భౌగోళిక ప్రాంతంలో 25 శాతంకన్నా తక్కువ భాగంలో మాత్రమే అడవులున్నాయి. దీన్ని కనీసం 33 శాతానికి పెంచుతామని 1988 మొదలుకొని కేంద్రంలో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలన్నీ చెబుతూనే ఉన్నాయి. ఇందుకు భిన్నంగా 1990లో 28 శాతం అటవీ ప్రాంతమున్న స్పెయిన్‌ ప్రస్తుతం దాన్ని 37 శాతానికి పెంచుకుంది. మనం ఇలా 0.21 శాతం చొప్పున అడవుల్ని విస్తరించుకుంటే ఎన్ని దశాబ్దాలకు లక్ష్యం చేరుకుంటామో ఊహిం చుకోవచ్చు. పైగా మన నివేదిక చెప్పే అడవుల్లో నేలకూల్చిన చెట్లకు బదులుగా నాటిన మొక్కలు కూడా ఉన్నాయి. కనుక నివేదిక చెబుతున్న 0.21 అటవీ విస్తరణ కూడా లొసుగుల మయమే. ఇదిగాక ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రాజెక్టుల పేరు చెప్పి  అడవుల నరికివేత యధేచ్ఛగా సాగుతోంది.

మన దేశంలో ఆనకట్టలు కావొచ్చు... రహదారుల విస్తరణ కావొచ్చు... నగరాల నిర్మాణం కావొచ్చు.... ఏ ప్రాజెక్టు అమల్లోకి వచ్చినా ముందుగా తెల్లారేది నిరుపేద జనం బతుకులు. ఆ తర్వాత వంతు వృక్షాలది. ఇరవైయ్యేళ్లక్రితం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమం నగరాలు, పట్టణాలు, గ్రామాల మధ్య అనుసంధానాన్ని ఎన్నో రెట్లు విస్తృతపరిచింది. మారుమూల ప్రాంతాలకు కూడా వాహనాలు వెళ్లగలుగుతున్నాయి. సంపద ఎన్నో రెట్లు పెరిగింది. కానీ ఆ అభివృద్ధి క్రతువుకు ప్రజానీకం చెల్లిస్తున్న మూల్యం తక్కువేమీ కాదు. మహా వృక్షాలు నేలకూలాయి. ఎన్నో విలువైన చెట్లు, మొక్కలు కనుమరుగ య్యాయి. గ్రామాలకు కోతుల బెడద పెరిగింది. అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవసానాలెలా ఉంటాయో ఇప్పుడెవరూ చెప్పనవసరం లేకుండానే ప్రజలకు అర్థమవుతోంది. దేశ ప్రగతికి అభివృద్ధి ప్రాజె క్టులు అవసరమే. కానీ వాటికీ, పర్యావరణానికీ... వాటికీ, ప్రజల జీవనానికీ మధ్య సమతుల్యత సాధించగలిగితేనే ఆ అభివృద్ధికి అర్ధం ఉంటుంది. లేనప్పుడు అవి ప్రజానీకానికి పీడగా పరిణ మిస్తాయి. ప్రభుత్వాలు ఈ సంగతి గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top