గరళ కంఠ భారతం | Sakshi
Sakshi News home page

గరళ కంఠ భారతం

Published Fri, Mar 22 2024 4:45 AM

Sakshi Editorial On Air Pollution in India

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్‌’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది.

వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల తర్వాత మూడో స్థానం భారత్‌దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్‌ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్‌ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. 

ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్‌ సీజన్‌లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్‌లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్‌తక్, యూపీలోని మీరట్‌ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది.

ఐక్యూ ఎయిర్‌ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్‌ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. 

గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్‌ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి.

కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్‌లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్‌ మీటర్‌కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్‌ మీటర్‌కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో, క్యూబిక్‌ మీటర్‌కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్‌ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్‌ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్‌లో క్యూబిక్‌ మీటర్‌కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్‌ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం.

దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్‌ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్‌ విద్యుత్తే అన్నది గమనార్హం.

ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్‌ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్‌ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం.

అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్‌జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి.

సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్‌ నివేదిక మనకు మరో మేలుకొలుపు. 

Advertisement
 
Advertisement