ఏ కులము నీదంటే?

What Is Your Caste - Sakshi

సాహిత్య మరమరాలు

దేశానికి ఇంకా స్వతంత్రం రాని రోజులవి. తనతో పాటు రైల్లో ప్రయాణిస్తున్న ఒక ఖద్దరు దుస్తుల వ్యక్తిని ఎగాదిగా చూస్తూ, ‘‘మనదే కులం బాబూ?’’ అని అడిగాడో పెద్దమనిషి. ‘‘గాంధీగారు నడయాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలూ, మతాలూ ఏమిటండీ?’’ అని నవ్వేశాడాయన. కానీ పెద్దమనిషి వదిలే రకంలా కనపడలేదు. ‘‘తమ తండ్రిగారు కులం తక్కువ పిల్లని కానీ మనువాడినారా నాయనా, చెప్పుకోటానికి సంకోచిస్తున్నావు?’’ అని ఎద్దేవా చేశాడు. ఖద్దరు మనిషి నొచ్చుకోలేదు సరికదా, చాదస్తపు పెద్దాయనకు నవ్వుతూ ఇలా జవాబిచ్చాడు: ‘‘నా కులం ఏదో నాకే అర్థం కాక చెప్పటానికి తటపటాయిస్తున్నాను. ఉదయం కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో నేను పాకీమనిషిని. గడ్డం గీసుకునే సమయంలో క్షురకుడిని.

స్నానం చేయబోయే ముందు రజకునిలా రూపాంతరం చెంది విడిచిన బట్టలను ఉతుక్కుంటాను.   ఆఫీసులో ఆవర్జా పుస్తకాలను వైశ్యుడిలా తయారు చేస్తాను. సాయంకాలం వేళల్లో నాపిల్లలకీ, వారి తోటి మిత్రులకీ పాఠాలు చెప్పేటప్పుడు పంతులుగా మారతాను. ఇప్పటికైనా తెలిసిందా నాకులం ఏదో’’ అని చెబుతుండగా రైలు స్టేషన్‌లో ఆగటం, కాంగ్రెస్‌ కార్యకర్తలు ‘జె.బి.కృపలానీకి జై’ అంటూ బిలబిలా బోగీ వైపు రావటం జరిగిపోయాయి.  (మన్నవ గిరిధర రావు ‘పనికొచ్చే కథలు’ చదివాక.)  పి.వి.ఎస్‌.సత్యనారాయణ
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top