ఈయూలో కొత్త గాలి

Sakshi Editorial On European Union Election

‘సరిహద్దులు లేని ఒకే దేశం’ ఆకాంక్షతో ఆవిర్భవించిన యూరప్‌ యూనియన్‌(ఈయూ)కు ఈ నెల 23–26 మధ్య జరిగిన ఎన్నికల్లో ఓటర్లు చిత్రమైన తీర్పునిచ్చి సంస్థ మనుగడను చిక్కుల్లో పడేశారు. ఈయూలో నాలుగు దశాబ్దాలుగా పెత్తనం చలాయిస్తూ వచ్చిన మధ్యేవాద పక్షాల బలాన్ని తగ్గించి, పరస్పరం తీవ్రంగా విభేదించుకునే పర్యావరణ అనుకూలవాదులనూ, ఉదార వాదులనూ, తీవ్ర మితవాదులనూ అధికంగా గెలిపించారు. పర్యవసానంగా మున్ముందు ఈయూ అస్థిత్వం ఒడిదుడుకులను ఎదుర్కొనక తప్పేలా లేదు. ఒకపక్క ఈయూలో బ్రిటన్‌ మనుగడ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఈలోగానే పులి మీద పుట్రలా వచ్చిన ఈయూ ఫలితాలు అందరిలోనూ వణుకు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లలో పర్యావరణ అనుకూల హరిత పార్టీలకు ఆదరణ లభించింది. పర్యావరణ అనుకూలురతో పోలిస్తే తీవ్ర మితవాదులు అనుకున్న స్థాయిలో సీట్లు సంపాదించుకోలేకపోయినా సంస్థలో మధ్యేవాద పక్షాలకు పెను సవాల్‌గా  మార బోతున్నారు. 751 స్థానాలుండే యూరొపియన్‌ పార్లమెంటులో వారికి 25 శాతం స్థానాలు దక్కు తాయి. ఇది గత ఎన్నికలతో పోలిస్తే 5 శాతం ఎక్కువ.

అమెరికాకు దీటుగా పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా, భవిష్యత్తులో సరిహద్దులు లేని ఒకే దేశంగా రూపొందాలన్న బలమైన ఆకాంక్షే ఈయూ ఆవిర్భావానికి మూలకారణం. 1957లో ఆరు దేశాల కూటమిగా మొదలైన ఈ సంస్థలో ప్రస్తుతం 28 దేశాలకు సభ్యత్వముంది. ఉమ్మడి పార్లమెంట్, ఉమ్మడి చట్టాలు, ఉమ్మడి న్యాయవ్యవస్థ ఏర్పరుచుకోవాలన్నది ఈ దేశాల ఆశయం. అయితే ఈ దిశగా ముందడుగులు పడుతున్నకొద్దీ సభ్య దేశాల పౌరుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. సము న్నత ప్రజాస్వామ్య దేశంగా ఉన్న తాము ఈయూ నీడలో కుంచించుకుపోతామన్న సందేహాలు అంకురించాయి. బ్రిటన్‌లో రగుల్కొన్న ఈ అసంతృప్తి క్రమేపీ విస్తరించి చివరకు మూడేళ్లక్రితం జరి గిన రిఫరెండమ్‌లో  సంస్థ నుంచి వైదొలగడానికి 51.9 శాతంమంది మొగ్గుచూపారు. ఈయూలోనే కొనసాగాలన్నవారి శాతం 48.1 శాతం మించలేదు. తమ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిట న్నది పట్టించుకోకుండా ఈయూ చట్టాల పేరిట ఇష్టానుసారం వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆ రకంగా తమ ఆర్థిక వనరులకు గండికొడుతున్నారని బ్రిటన్‌లో మాత్రమే కాదు... చాలా దేశాల పౌరుల్లో అసంతృప్తి రగుల్కొంది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడ్డ సంక్షోభంతో లక్షలాది మంది ఈయూ దేశాలకు వలసబాట పట్టడం ఈ అసంతృప్తికి మూలకారణం.

ఈయూలో పలుకు బడి ఉన్న మధ్యేవాద పక్షాలు మొదట్లో వలసల విషయంలో ఉదారంగానే వ్యవహరించినా వివిధ దేశాల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత గమనించి విధానాలను సవరించాయి. వలసల నియంత్రణకు ప్రయత్నించాయి. కానీ అసంతృప్తి చల్లారలేదు. తీవ్ర మితవాద పక్షాల ప్రభావం తగ్గలేదు. వాస్తవా నికి బ్రిటన్‌ ఈపాటికే ఈయూ నుంచి నిష్క్రమించాల్సి ఉంది. అందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ఒప్పందం ఆ దేశ పార్ల మెంటులో వీగిపోవడం పర్యవసానంగా అది అనిశ్చితిలో పడింది. ఒప్పందం ఉన్నా, లేకున్నా వచ్చే అక్టోబర్‌లో ఎటూ ఈయూ నుంచి బయటకు రాకతప్పదు. అయినా నిబంధనల ప్రకారం ఈయూ ఎన్నికల్లో బ్రిటన్‌ పాల్గొనక తప్పలేదు. సహజంగానే ఈయూ నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన యూకే ఇండిపెండెంట్‌ పార్టీ(యూకేఐపీ) ఈ ఎన్నికల్లో 31శాతం ఓట్లు గెల్చుకుంది. అధికార పక్షం కన్సర్వేటివ్‌ పార్టీ ఓట్లను అది భారీగా కొల్లగొట్టింది. ఫలితంగా కన్సర్వేటివ్‌లో అయిదో స్థానంలో నిలిచారు. అటు ఈయూలో కొనసాగాలంటున్న లిబరల్‌ డెమొక్రాట్లు 20 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో ఉంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ మూడో స్థానంలో నిలిచింది. 

ఈయూను నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న మధ్యేవాద మితవాద పక్షమైన యూరొపియన్‌ పీపుల్స్‌ పార్టీ(ఈపీపీ), మధ్యేవాద వామపక్ష కూటమి(ఎస్‌డీ) ప్రాభవం కోల్పోయాయి. జర్మనీ చాన్సలర్‌ నేతృత్వంలోని ఈపీపీ 180 స్థానాలు, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ నాయకత్వం వహించిన ఎస్‌డీ 146 స్థానాలు గెల్చుకున్నాయి. ఫ్రాన్స్‌ ప్రధాని మేక్రోన్‌ నాయకత్వంలోని ఉదార వాదులు 109 స్థానాలు సాధించారు.  పర్యావరణ అనుకూల హరిత పక్షాలు 70 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కర్బన ఉద్గారాలతో పర్యావరణం నాశనమై భూగోళానికి ముప్పు ముంచుకొస్తున్నం దున తక్షణ చర్యలు అవసరమని కోరుతున్న ఈ పక్షాలు జర్మనీలో రెండో స్థానాన్ని, ఫ్రాన్స్‌లో మూడో స్థానాన్ని తెచ్చుకున్నాయి. ఇతరచోట్ల సైతం ప్రభావాన్ని చూపాయి. ముందూ మునుపూ ఇవి ఒక రాజకీయ శక్తిగా అవతరిస్తాయన్న అభిప్రాయం కలిగించాయి. వలసలను తీవ్రంగా వ్యతి రేకించే వివిధ రకాల మితవాద పక్షాలు 175 స్థానాలు గెల్చుకున్నాయి. ఇలా పరస్పర విరుద్ధ భావాలకు ప్రాతినిధ్యంవహించే పక్షాలు బలం పుంజుకోవడం వల్ల ఈయూ నిర్వహణ ఇకపై కత్తి మీది సామే. ఈయూ పార్లమెంటుకు ప్రతినిధులను ఎన్నుకోవడానికే ఈ ఎన్నికలు జరిగినా అందులోని  సభ్య దేశాల పౌరులు తమ తమ ప్రయోజనాల దృష్టితోనే ప్రతినిధులను ఎంచుకు న్నారు. ఒక సంస్థగా ఇది ఈయూ వైఫల్యమనే చెప్పాలి. దశాబ్దాలు గడిచినా 28 దేశాల పౌరుల్లోనూ అది ఉమ్మడి భావనను తీసుకురాలేకపోయింది. హరితవాదులు గణనీయమైన సంఖ్యలో సీట్లు సంపా దించుకోవడం వల్ల జర్మనీ తదితరచోట్ల శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించాలన్న ఒత్తిళ్లు పెరుగు తాయి. ఆ సంగతలా ఉంచి ఈయూను నడిపించే యూరొపియన్‌ కమిషన్‌కు సారథిగా ఎవ రుండాలన్న విషయంలో జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య ఇప్పటికే విభేదాలు తలెత్తాయి. పౌరుల్లో ఈయూ పట్ల వ్యతిరేకత క్రమేపీ పెరుగుతున్నదని అర్ధమయ్యాక మరికొన్ని దేశాలు కూడా బ్రిటన్‌ బాటపట్టే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఎన్నో వైరుధ్యాలతో నాలుగు దశాబ్దాలు నెట్టుకొచ్చిన ఈయూ వచ్చే అయిదేళ్లూ ఏ దిశగా సాగుతుందో వేచిచూడాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top