జీవితం నాలుగ్గోడల గది అయినప్పుడు...

If Life Between Model Of One Room - Sakshi

కొత్త బంగారం

‘రూమ్‌’ నవల, జాక్‌ ఐదో పుట్టినరోజున మొదలవుతుంది. జాక్‌కు తెలిసినది కేవలం  పేరుండని ‘మా’ తో పాటు తనుండే సౌండ్‌ ప్రూఫ్‌ చేసిన పదకొండడుగుల చదరపు గదే. తన 19 ఏళ్ళప్పుడు అపహరించబడిన ‘మా’– ఏడేళ్లుగా ఆ ‘గది’లో ఉంటూ జాక్‌ను కంటుంది. కథకుడు పిల్లవాడే. పగలు ఇంటికప్పు నుంచి సూర్యరశ్మి వస్తుంది. రాత్రి అయినప్పుడు, ‘రాక్షసుడు వచ్చి సూర్యుడిని మింగేశాడు’ అనుకుంటాడు మా చెప్పే కథలు వినే జాక్‌.  గది తలుపు, కోడ్‌ వాడితే తప్ప తెరుచుకోదు. ఆ కోడ్, ‘మా’ను అపహరించిన ‘ఓల్డ్‌ నిక్‌’ వద్దే ఉంటుంది. కొడుక్కి నేర్పించడంలో, పెంచడంలో, సంతోషపెట్టడంలో తనకున్న మానసిక శక్తినంతటినీ వెచ్చిస్తుంది మా. ఆ ప్రక్రియలో తన స్వస్థచిత్తతనూ కాపాడుకుంటుంది. గదిలో ఉండేవి– ఒక టీవీ, బీరువా, కొన్ని పుస్తకాలు. ‘ఓల్డ్‌ నిక్‌’ వచ్చినప్పుడు, జాక్‌ బీరువాలో దాక్కోవాలని మా ఆజ్ఞాపిస్తుంది. నిజమైన మనుషులకు చెప్పేలాగానే గదిలో ఉన్న వాటన్నిటికీ, ‘గుడ్‌ నైట్‌ గది, గుడ్‌ నైట్‌ కార్పెట్‌’ అని చెప్తుంటారిద్దరూ. బయట కూడా ఒక లోకం ఉంటుందని జాక్‌కు తెలియదు. తల్లికి గది జైలయినా కొడుక్కి అదే స్వర్గం. టీవీలో కనిపించేవి మరే గ్రహంవో అని తలపోస్తాడు. ‘నేను మనిషిని అయి ఉంటాను. మా కూడా మనిషేనేమో!’ అనుకుంటాడు. మా చనుబాలు తాగడం, ఆమెతోపాటు స్నానం చేయడంలో ఊరట పొందుతాడు. ‘ఓల్డ్‌ నిక్‌’ వచ్చినప్పుడు, బీరువాలో దాక్కుని, వినిపిస్తుండే శబ్దాలని లెక్కపెడుతూ, అతను మా మీద చేసే బలాత్కారం పూర్తయిందో లేదో గ్రహిస్తాడు.

దృఢ సంకల్పంతో, మా– జాక్‌ కోసం ఒక జీవితాన్నయితే సృష్టిస్తుంది కానీ అది తమిద్దరికీ సరిపోదనుకున్నప్పుడు, తప్పించుకునే ప్రణాళిక వేస్తుంది. ‘జాక్‌ జబ్బు పడ్డాడు. హాస్పిటల్‌ అవసరం’ అని ఓల్డ్‌ నిక్‌కు చెప్తుంది కానీ అతను వినడు. అప్పుడు జాక్‌ను కార్పెట్లో చుట్టేసి, అబ్బాయి చనిపోయాడని అబద్ధం చెప్తుంది. అతను జాక్‌ను తనతో తీసుకువెళ్తాడు. పిల్లాడు– తల్లి చెప్పినట్టే, ఓల్డ్‌ నిక్‌ను తప్పించుకుని ఒక అపరిచితుడిని సమీపిస్తాడు. అతని సహాయంతో పోలీసులకు– అతి కష్టం మీద, గదికుండే దారి చెప్పగలుగుతాడు. అప్పుడు మా కూడా బయటపడుతుంది.   ఓల్డ్‌ నిక్‌ జైలు పాలవుతాడు. మా – తన కుటుంబాన్ని కలుసుకుంటుంది. అయితే అపరిచితులు, కొత్త అనుభవాలు నచ్చని జాక్, ‘ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూశాను, చాలు. అలిసిపోయాను. గదికి వెళ్ళిపోదాం’ అంటాడు. ఈ లోపల కేసు మీడియా దృష్టికి రావడం వారిద్దరి జీవితాలనీ దుర్భరం చేస్తుంది. రచయిత్రి ఎమ్మా డానహ్యూ– అద్భుతమైన నైపుణ్యంతో గందరగోళమైన ప్రపంచ స్వేచ్ఛను జాక్‌కు పరిచయం చేస్తారు.

‘‘పిల్లల్ని గమనిస్తుంటే, తల్లిదండ్రులకి వాళ్ళంటే ఇష్టం అనిపించడం లేదు. ‘ఎంత ముద్దుగా ఉంటారో!’ అంటూ వాళ్ళ ఫొటోలు తీసుకుంటూనే, కబుర్లు చెప్పుకుంటారు తప్ప, పిల్లలతో ఆడుకోరెందుకో!’’ అంటూ ఆశ్చర్యపోతాడు జాక్‌.మా కు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఆమె స్వేచ్ఛ ఎక్కువవుతున్నకొద్దీ ఆమె కేవలం తనతోనే ఉండాలన్న జాక్‌ అసహనమూ పెరుగుతుంది. ‘గదిలో మాకు అన్ని పనులూ చేసే టైముండేది. ఇక్కడ కాలం ఒక చోట నిలవకుండా, వెన్నలాగా ప్రపంచమంతటా పాకిపోవడంవల్లనేమో, అందరికీ పరిమితమైన సమయమే ఉంది’ అనుకుంటాడు. ఒకసారి గదిని చూసి రావడానికి వెళ్తారిద్దరూ. ప్రపంచం గురించిన తన కొత్త దృక్కోణంతో చూసినప్పుడు, దానితో తనకుండే పాత అనుబంధం మరుగై, ఆ నిర్బంధకరమైన చోటుకి సులభంగానే వీడ్కోలు పలకగలుగుతాడు జాక్‌. తల్లీకొడుకులు కొత్త జీవితం ప్రారంభిస్తారు.పుస్తకం– జీవితంలో తగిలిన దెబ్బలని తట్టుకుని తిరిగి నిలుచోవడం గురించినది. కథనం– మితిమీరిన అమాయకత్వం కనబరచకుండా, పిల్లల వాస్తవికమైన కంఠాన్ని వొడిసి పట్టుకోగలుగుతుంది. మనం జీవించే లోకం గురించిన ఒక తాజా కోణాన్ని చూపుతూనే, ప్రేమకి ఒక వినూత్నమైన నిర్వచనం ఇస్తుంది నవల. ఐదేళ్ళ బాలుడి కథనాన్ని పాఠకులు తమ గ్రహింపు ప్రకారం వివరాలు జోడించుకుంటూనో, తీసివేసుకుంటూనో అర్థం చేసుకోవాలి.   బుకర్‌ ప్రైజుకి షార్ట్‌ లిస్ట్‌ అయిన ఈ నవలని లిటిల్‌ బ్రౌన్, 2010లో ప్రచురించింది. దీని ఆధారంగా ఇదే పేరుతో 2015లో సినిమా కూడా వచ్చింది.
 కృష్ణ వేణి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top