‘దలైలామా నోట్‌’

Centre Issues Secret Note For Not Attending Dalailama Celebraions - Sakshi

దేశాల మధ్య సంబంధాలను నిర్దేశించే అంశాల్లో అవసరాలు, అనివార్యతలు కీలకమైనవి. ఇవి పట్టనట్టు వ్యవహరిస్తూ పాత విధానాన్నే కొనసాగించడం వల్ల సమస్యలు తలెత్తక తప్పదు. ‘టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం’ విషయంలో, ప్రత్యేకించి బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేసి ఉండొచ్చునని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

దలైలామా మన దేశానికి వలసవచ్చి అరవైయ్యేళ్లయిన సందర్భంగా ‘ప్రవాస ప్రభుత్వం’ ఆధ్వర్యంలో ఈనెల 31, వచ్చే నెల 1 తేదీల్లో న్యూఢిల్లీలో కొన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉండగా వాటిల్లో పాల్గొనవద్దని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి పి.కె. సిన్హా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సీనియర్‌ నాయకులకూ, అధికారులకు సూచన చేస్తూ ఒక రహస్య నోట్‌ జారీ చేసిన తీరు ఆశ్చర్యం కలిగించకమానదు. ఈ నోట్‌ గురించి ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ నాలుగు రోజులక్రితం బయటపెట్టినప్పుడు దలైలామా విషయంలో ప్రభుత్వ వైఖరేమీ మారలేదన్న జవాబే వచ్చింది.

అయితే టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం న్యూఢిల్లీ కార్యక్రమాలను హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చడీచప్పుడు లేకుండా మార్చుకుంది. తొలుత అనుకున్నవిధంగా అయితే ఈనెల 31న రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు, ఆ మర్నాడు ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందులో సర్వమత ప్రార్థనల కార్యక్రమం రద్దయింది. ‘థాంక్యూ ఇండియా’ ధర్మశాలకు తరలిపోయింది.

మన దేశంలో 1959 నుంచి ‘టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం’ కొనసాగుతోంది. ఆ ఏడాది చైనా సైన్యం టిబెట్‌లోకి ప్రవేశించి అక్కడ జరిగిన తిరుగుబాటును అణిచేయడంతో వేలాదిమంది శరణార్ధులు మన దేశానికొచ్చారు. దలైలామా కూడా చైనా సైనికుల కన్నుగప్పి మారువేషంలో పదిహేను రోజులు హిమాలయ సానువుల్లో నడిచి మన దేశానికొచ్చారు. మొదట్లో ఆయన విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్న అంశంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఊగిసలాట ప్రదర్శించినా చివరకు స్వయంగా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.

అలాగని దలైలామ నాయకత్వంలోని ‘ప్రవాస ప్రభుత్వాన్ని’ గుర్తించలేదు. మొదట్లో టిబెట్‌ పౌరులకు కొన్ని పరిమితులతో పౌరసత్వ హక్కులు కల్పించారు. వారు మన దేశ పౌరుల్లాగే అన్ని రకాల హక్కులూ అనుభవించవచ్చుగానీ... ఓటు హక్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేసే హక్కు మాత్రం లేవు. కానీ ఆచరణలో ఇందువల్ల సమస్యలు తలెత్తుతున్నాయని భావించి మూడేళ్లక్రితం కొత్త విధానం ప్రకటించారు. వారికి భూమిని లీజుకివ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, అర్హతల్నిబట్టి ఉద్యోగాలు కల్పించడం వగైరాలు అందులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని అరుణాచల్‌ప్రదేశ్‌ అమలు చేయడం ప్రారం భించింది కూడా.

కానీ సమస్యేమంటే దలైలామాకు ఆశ్రయమివ్వడంగానీ, టిబెటిన్లను శర ణార్ధులుగా గుర్తించి వారికి సౌకర్యాలు కల్పించడంగానీ చైనాకు ససేమిరా ఇష్టం లేదు. అసలు దలైలామాను ప్రపంచ దేశాధినేతలైనా కలిసినా, ఆయన్ను పిలిచినా చైనాకు కోపం వస్తుంది. మొదట్లో దలైలామా దూకుడుగా ఉండేవారు. టిబెట్‌ను చైనా గుప్పెట్లో పెట్టుకుని ప్రజల మత, భాషా, సాంస్కృతిక హక్కుల్ని హరి స్తున్నదని ఆరోపించేవారు.

టిబెటిన్లకు స్వాతంత్య్రం లభిస్తే తప్ప పరిస్థితి మార దని చెప్పేవారు. ప్రపంచం నలుమూలలా ఉన్న దాదాపు కోటిమంది టిబెటిన్లు ఆయన్ను ఆధ్యాత్మికవేత్తగా భావిస్తారు. కానీ 1959 తర్వాత అక్కడి భూభాగం లోని పౌరులు చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దాఖలాలు లేవు. ఇటు దలై లామా వైఖరిలో కూడా కాలం గడిచినకొద్దీ మార్పు వచ్చింది. తాము చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రాన్ని కోరడం లేదని అయిదారేళ్లకిందటే ఆయన ప్రకటిం చారు. చైనాలో టిబెట్‌ను అంతర్భాగంగా గుర్తించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్ప డాలన్నది ఆయన ప్రస్తుత డిమాండు.

దలైలామతోపాటే మన దేశం కూడా టిబెట్‌ పౌరులతో వ్యవహరించే విధానాన్ని మార్చుకుంటోంది. చైనాతో సంబంధాలు మెరుగుపడినకొద్దీ టిబెటిన్ల విషయంలో కొన్ని పరిమితులు విధిస్తోంది. గతంలో ఇచ్చినట్టుగా టిబెట్‌ పౌరుల ఆందోళనలకు అనుమతినీయడం లేదు. చైనా నేతలు వచ్చినప్పుడల్లా ముందస్తు అరెస్టులు చేయడం, వారిపై నిఘా ఉంచడం రివాజైంది.

ఇప్పుడు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి జారీచేసిన నోట్‌ కూడా అలా క్రమేపీ సడలుతూ వస్తున్న వైఖరిలో భాగమే కావొచ్చు. కానీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కాకుండా మరే పార్టీకి చెందిన ప్రభుత్వమైనా ఇలాంటి నోట్‌ జారీ చేసి ఉంటే, వేరే వారి సంగతలా ఉంచి బీజేపీ నుంచే గట్టి వ్యతిరేకత వచ్చేది. మన విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే గత నెలలో చైనాలో పర్యటించి ఆ దేశ ఉప విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు.

ఈ స్థాయి చర్చలు జరగడం ఏడాది తర్వాత ఇదే ప్రథమం. భారత్‌లో దలైలామా కదలికలు ఉన్నప్పుడల్లా, టిబెట్‌ అంశంపై ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడల్లా సరిహద్దుల్లో చైనా సమస్య సృష్టించడం రివాజుగా మారింది. నిరుడు ఏప్రిల్‌లో దలైలామా అరుణాచల్‌లో పర్యటించాకే డోక్లాంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అది దాదాపు నిరు డంతా సాగింది. అరుణాచల్‌ ప్రాంతంలో చైనా సైనికుల హడావుడి ఎక్కువైంది. వచ్చే జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశాలకు వెళ్తున్నారు.

అందువల్ల కూడా టిబెట్‌ ఉత్సవాలు దేశ రాజధానిలో జరగకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చు. కానీ అందుకు ఇతర మార్గాలు ఎన్నుకుని ఉండాల్సింది. ‘టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ’ పెద్దలతోనే కార్యక్రమాల నిర్వహణ విషయం మాట్లాడితే వారే దానికి తగినట్టుగా కార్యాచరణను రూపొందించుకునేవారు. ఆ పని చేయకుండా  నోట్‌ వెలువరించడం, అది కాస్తా రచ్చకెక్కడం వల్ల చైనాకు మనపై చిన్నచూపు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top