కుప్పకూలిన సంకీర్ణం

BJP Snaps Alliance With PDP in Jammu and Kashmir - Sakshi

జమ్మూ–కశ్మీర్‌లో ఆదినుంచీ ఒడిదుడుకులతో నెట్టుకొస్తున్న పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి మంగళవారం కుప్పకూలింది. కూటమినుంచి తప్పుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించ డంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా సమర్పించారు. ఇది హఠాత్‌ పరిణామమే కానీ...అనూహ్యమైనదేమీ కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలూ భిన్న ధ్రువాలు. 2014 నవంబర్‌–డిసెంబర్‌ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. 87 స్థానాలున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 44 స్థానాలు కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కశ్మీర్‌ ప్రాంతంలో పీడీపీ 28 స్థానాలు గెల్చుకోగా, హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. అంతవరకూ పాలకపక్షంగా ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 15, కాంగ్రెస్‌ 12 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అనిశ్చితిలో పీడీపీ, బీజేపీలు సుదీర్ఘంగా మంతనాలు సాగించి ‘కనీస ఉమ్మడి అజెండా’ను రూపొందించుకుని ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దురదృష్టవశాత్తూ ముఫ్తీ ఏడాది గడవకుండానే కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ రెండున్నర నెలలపాటు అనిశ్చితే రాజ్యమేలింది. మళ్లీ చర్చోపచర్చలు జరిగాయి. చివరకు పాత అజెండాతోనే ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. 

చైనా, పాకిస్తాన్‌లతో సరిహద్దులున్న జమ్మూ–కశ్మీర్‌ దశాబ్దాలుగా మిలిటెన్సీతో అట్టుడుకు తోంది. కనుకనే అక్కడ అత్యంత మెలకువతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణం గానే కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడం రివాజు. పీడీపీ, బీజేపీలు భిన్న ధ్రువాలు గనుక అది సాధ్యపడదేమోనని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ ఆ పార్టీలు తలకిందులు చేసి సన్నిహితమయ్యాయి. జమ్మూ–కశ్మీర్‌ సమస్యకు జాతీయ పరిష్కారం కోరే దిశగా తమ అజెండాను రూపొందించుకున్నా మని రెండు పార్టీలూ చెప్పడం చాలామందికి నచ్చింది. కశ్మీర్‌ విషయంలో బీజేపీ అభిప్రాయాలు అందరికీ తెలుసు. అయితే 2014 ఎన్నికల్లో 370 అధికరణం అంశాన్ని ఆ పార్టీ పక్కన పెట్టింది. ఇతర అంశాల్లో సైతం తన వైఖరిని సడలించుకోబట్టే అది పీడీపీతో జత కట్టిందని అనేకులు భావిం చారు. అటు జమ్మూ, ఇటు కశ్మీర్‌ మత ప్రాతిపదికన చీలినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఇది శుభ పరిణామని వారు విశ్వసించారు. ఇరు పార్టీలూ ప్రత్యర్థులుగా ఉండటం మంచిదికాదని వారి భావన. కానీ పీడీపీ, బీజేపీలు తాము కూటమిగా ఉన్నామని,మంచి పాలన అందించాలని మరిచినట్టు గత రెండేళ్ల పరిణామాలు రుజువుచేశాయి.

కశ్మీర్‌ సమస్యను ఆదినుంచీ బీజేపీ శాంతిభద్రతల సమస్యగానే చూస్తోంది. అక్కడ రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలం కావడం వల్లనే ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్న వాదననను ఆ పార్టీ అంగీకరించదు. ఆ సమస్య విషయంలో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం గత అక్టోబర్‌లో అందుకోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా పనిచేసి రిటైరైన దినేశ్వర్‌ శర్మను మధ్యవర్తిగా ప్రకటించడం ఈ అవగాహన పర్యవసానమే. అంతక్రితం పలుమార్లు మధ్యవర్తుల రాయబారాలు నడిచాయి. వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకసారి కేంద్ర మాజీ మంత్రి కేసీ పంత్‌నూ, మరోసారి ప్రస్తుత గవర్నర్‌ ఎన్‌. ఎన్‌. వోహ్రాను నియమించింది. యూపీఏ సర్కారు ప్రముఖ పాత్రికేయుడు దిలీప్‌ పడ్గావ్‌కర్‌ తదితరులతో మధ్యవర్తుల కమిటీ నియమించింది. ఆ ప్రభుత్వాలు మధ్యవర్తులిచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నాయన్న సంగతలా ఉంచితే కనీసం మాజీ పోలీస్‌ అధికారులను ఆ పని కోసం నియమించలేదు. దినేశ్వర్‌ శర్మ ఏం సాధించారో తెలియదుగానీ అప్పటికీ, ఇప్పటికీ కశ్మీర్‌ పరిస్థితి అయితే దారుణంగా క్షీణించింది. కనీస ఉమ్మడి అజెండాలోని 15 అంశాలనూ సమర్ధవంతంగా అమలు చేసి ఉంటే కశ్మీర్‌ పరిస్థితి ఇంత దిగజారేది కాదు. యువకుల్లో నైపుణ్యాభివృద్ధి, సిద్ధాంతాలు ఎలాంటివైనా అన్ని పక్షాలతో చర్చించడం, అకౌం టబిలిటీ కమిషన్‌ ఏర్పాటు, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వర్తింపుపై సమీక్ష, వాజపేయి నినాదమైన ఇన్‌సానియత్‌(మానవత్వం), జమ్రూహియత్‌(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్‌(కశ్మీరీ సంస్కృతి, సంప్రదాయం)ల అమలు వగైరాలు ఆ అజెండాలోని ముఖ్యాంశాలు.  

కశ్మీర్‌ సమస్యపై పాకిస్తాన్‌తో చర్చలు ప్రారంభించడం, హుర్రియత్‌ నేతలతోసహా కశ్మీర్‌లోని సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడటం వంటి అంశాల్లో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు న్నాయి. భద్రతా దళాలకూ, ఉద్యమకారులకూ మధ్య తరచుగా తలెత్తే ఘర్షణల్లో మెహబూబా వైఖరికీ, బీజేపీ వైఖరికీ పొంతనే లేదు. మొన్నటికి మొన్న కథువాలో ఎనిమిదేళ్ల పాప అసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య విషయంలోనూ ఇరు పార్టీలూ వేర్వేరు వాదనలు చేశాయి. ఎన్నో ఒత్తిళ్ల తర్వాతగానీ ఆ కేసు నిందితులకు వత్తాసు పలికిన బీజేపీ మంత్రులు కేబినెట్‌ నుంచి తప్పుకోలేదు. ఇక రంజాన్‌ మాసం సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని మెహ బూబా ఒత్తిడి తెస్తే తొలుత కేంద్రం ససేమిరా అంది. చివరకు అయిష్టంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేయించింది. కానీ దానివల్ల ఆశించిన ఫలితం రాలేదు సరిగదా ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ప్రముఖ పాత్రి కేయుడు సుజాత్‌ బుఖారీని కాల్చిచంపారు. జవాన్‌ ఔరంగజేబును చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. కూటమిలో కొనసాగడం వల్ల ఇలాంటి చర్యలన్నిటికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితిలో పడ్డామని బీజేపీకి బెంగపట్టుకున్నట్టుంది. కానీ ఇకపై అన్నిటికీ తామే జవాబుదారీ అవుతామని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి. కశ్మీర్‌ విషయంలో మరింత జాగురూకతతో మెలగాలని, దాన్ని మరింత విషాదం చుట్టుముట్టకుండా చూడాలని అందరూ కోరుకుంటారు.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top