జన ఘన తంత్రం!

70th Republic Day Of India - Sakshi

‘ఇదొక కృతనిశ్చయం. ఇది వాగ్దానం, భద్రత. వీటన్నిటికీ మించి మనమంతా చిత్తశుద్ధితో అంకితం కావాల్సిన బృహత్తర లక్ష్యం’. రాజ్యాంగ నిర్ణాయక సభలో 1946 డిసెంబర్‌లో భావి భారత రాజ్యాంగం ఏవిధంగా ఉండాలో నిర్దేశించే తీర్మానాన్ని ప్రవేశపెడుతూ జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పిన మాటలివి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్ణాయక సభ ఆ తర్వాత ఎన్నిటినో విపులంగా అధ్యయనం చేసి, ఎంతో మేధోమథనం జరిపి రూపొందించిన రాజ్యాంగం తన ప్రస్థా నాన్ని ప్రారంభించి రేపటితో ఏడు దశాబ్దాలు పూర్తవుతోంది. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ నిర్ణాయక సభ రాజ్యాంగాన్ని ఆమోదించగా, అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకొచ్చింది. ‘భారత ప్రజల మగు మేము...’ అంటూ మొదలయ్యే రాజ్యాంగ పీఠిక కేవలం మాటల కూర్పు కాదు. అదొక సమున్నత ఆశయ ప్రకటన. అది త్రికరణశుద్ధిగా ఆచరించి సాధించాల్సిన లక్ష్యాల సమా హారం. శతాబ్దాలుగా సమాజంలో నెలకొన్న అసమానతలు, వైరుధ్యాలు, వాదవివాదాలు గమనం లోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇందులో ప్రాచీన భారతీయ విలువలకు ప్రాముఖ్యతనీయలేదని, మనుధర్మ సూత్రాలను గమనంలోకి తీసు కోలేదని, వీటికి బదులు అమెరికా, బ్రిటన్, కెనడా తదితర దేశాల రాజ్యాంగాల్లోని అంశాలను పరి గణనలోకి తీసుకుంటున్నారని రాజ్యాంగ రచనా ప్రక్రియ క్రమంలోనే అనేకులు విమర్శించారు.

కానీ డాక్టర్‌ అంబేడ్కర్, రాజ్యాంగ సభలోని ఇతర పెద్దలూ వీటన్నిటినీ తట్టుకుని కర్తవ్యనిష్టతో తమ కప్పగించిన బాధ్యతల్ని పరిపూర్తి చేశారు. తమ అధ్యయన ఫలితాలకు, తమ సమష్టి విజ్ఞతను రంగ రించారు. వెలుపలినుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తమలో తమకు ఎన్ని వైరుధ్యాలున్నా దేశ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కలిసికట్టుగా వ్యవహరించారు. జవాబుదారీతనంతో పనిచేశారు. పర్యవసానంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. కానీ మన సమాజం ఎలాంటిదో, అందులోని గుణదోషాలేమిటో డాక్టర్‌ అంబేడ్కర్‌కు బాగా తెలుసు. వాటిని సరిదిద్దక పోతే ఎలాంటి పరిస్థితులేర్పడతాయో ఆయన సరిగానే గ్రహించారు. అందుకే రాజ్యాంగ నిర్ణాయక సభలోనే ఆయనొక హెచ్చరిక చేశారు. ‘మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాంగానీ సామాజిక, ఆర్థిక జీవితంలో అత్యధికులకు దాన్ని నిరాకరిస్తున్నాం. ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరి ష్కరించకపోతే ఈ అసమానతల కారణంగా బాధలకు లోనయ్యేవారు రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణ సౌధాన్ని ధ్వంసం చేస్తార’ని ఆయనన్నారు. కనుక ఈ ఏడు దశాబ్దాల గణతంత్ర ప్రజా స్వామ్య ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవాలి. ఆ ప్రస్థానం రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగానే సాగిందా... అది సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించిందా...

దాని ఆస రాతో మనం సురాజ్యాన్ని స్థాపించుకోగలిగామా అని ప్రశ్నించుకోవాల్సివుంది. రాజ్యాంగం ఎంతటి ఉన్నతాశయాలతో, ఉదాత్త లక్ష్యాలతో లిఖించినా, దాని వెనుక ఎంత ఘనమైన చరిత్రవున్నా ఆచరించేవారు చిత్తశుద్ధితో, నిజాయితీతో, సత్యనిష్టతో మెలగనప్పుడు ఆచరణలో అది వృధాగా మిగిలిపోతుంది. మన రాజ్యాంగం కాలానుగుణంగా ఉండాలని, అందు కోసం అవసరానికి తగినట్టు దాన్ని సవరించేందుకు అవకాశం కల్పించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఈ రాజ్యాంగానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూల స్తంభాలు. అయితే వీటిని ఆధారం చేసుకుని మనం సామాజిక అసమానతలను, పెత్తందారీ పోకడలను తుద ముట్టించగలిగామా? దేశంలో ఆకలి, అనారోగ్యం, అవిద్య, నిరుద్యోగం రూపుమాపగలిగామా? యువతరానికి ఆశావహమైన భవిష్యత్తు కల్పించగలుగుతున్నామా? సకల రంగాల్లో స్వయంసమృద్ధి సాధించగలిగామా? ఈ ప్రశ్నలకు అవునని ఖచ్చితంగా జవాబు చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం మెరుగ్గానేవుంది. తిండి గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాం. సగటు ఆదాయం పెరిగింది. గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. సంపద వృద్ధి జరిగింది. ప్రాణాంతక వ్యాధులను అరి కట్టగలిగాం. కానీ అంతరాలు, అసమానతలు నానాటికీ పెరుగుతున్నాయి.

ప్రపంచీకరణ విధానాలు అమలు చేయడం ప్రారంభించాక సంక్షేమ రాజ్య భావన క్రమేపీ నీరసపడింది. ప్రపంచీకరణ విధానాల వల్ల పెరిగిన సంపదంతా కొంతమందికే దక్కింది. ఎలాంటి పలుకుబడీ లేని సాధారణ ప్రజా నీకం ఆర్థిక దురవస్థలు ఎదుర్కొంటూనేవున్నారు. వ్యవసాయం సంక్షోభంలో పడి, ఆ రంగం నుంచి నిష్క్రమిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అప్పులూ ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మ హత్యలకు పాల్పడే దుస్థితి నెలకొంది. అయినా సామాన్య పౌరు లకు ఈ వ్యవస్థపై నమ్మకం చెక్కు చెదరలేదు. రాజ్యాంగంపై విశ్వాసం సడలలేదు. కానీ నమ్మకం లేనిదల్లా ప్రజాజీవన రంగాల్లో పెత్తనం చలాయిస్తున్న పెద్దలకే. ఈ గణతంత్ర దినోత్సవ సమయాన ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వుంది. సమాజ హితానికి తోడ్పడేగలిగే సమున్నత ఉద్దేశాలెన్నో ఆదేశిక సూత్రాల్లో ఉండిపోయాయి. చట్టాలనూ, విధానాలనూ రూపొందించేటపుడు ప్రభుత్వాలు ఈ 123 ఆదేశిక సూత్రాలనూ పరి గణనలోకి తీసుకోవాలని రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. అదింకా సమర్థవంతంగా అమలు జర గాల్సేవుంది. అయిదేళ్లక్రితం రాజ్యాంగ దినోత్సవాన్నీ, డాక్టర్‌ అంబేడ్కర్‌ 125వ జయంతినీ పురస్క రించుకుని పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని, దాని పవిత్రతనూ, ఔన్నత్యాన్నీ కాపాడతామని, ప్రజాజీవన రంగంలో పారదర్శకతకూ, నైతికతకూ పెద్దపీట వేస్తామని లోక్‌సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ వెలుగులో ఆత్మ సమీక్ష చేసు కోవడం, లోటుపాట్లను సరిదిద్దుకోవడం అవసరమని అందరూ గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top