
‘హోదా’పై అదే పోరు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అలుపెరగని పోరు కొనసాగుతోంది.
- రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమవుతున్న ఆందోళనలు
- కొనసాగుతున్న దీక్షలు, ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అలుపెరగని పోరు కొనసాగుతోంది. ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ర్యాలీలు, నిరాహార దీక్షలు, వినూత్న నిరసన కార్యక్రమాలతో ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో మంగళవారం వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు.
నెల్లూరు: విడవలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. కావలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటాచలంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
అనంతపురం: కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, సీపీఎం, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాయదుర్గంలో నాలుగో రోజు దీక్షలను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. గుత్తి, గుంతకల్లులో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో నాలుగో రోజూ రిలే దీక్షలు కొనసాగాయి.
కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బద్వేలు లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూ రు, రాయచోటి, కడప, రాజంపేటలో రిలే దీక్షలు కొనసాగాయి.
కర్నూలు: పాణ్యం, కర్నూలు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డి, ఐజయ్యలు పాల్గొన్ని సంఘీభావం తెలిపారు.
తిరుపతి: తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట సర్కిల్, పలమనేరు, నారాయణవనం, ఐరాల, నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, దీక్షలు జరిగాయి.
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద దీక్షా శిబిరాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాధరావు ప్రారంభించారు. పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, టెక్కలి, పలాస, ఎచ్చెర్ల, పాలకొండ, ఇచ్ఛాపురంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు.
విజయనగరం: తొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. విజయనగరం పట్టణం, సాలూరు, కురుపాం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోటలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. బొబ్బిలిలో రిలే దీక్షలను కొనసాగించారు.
తూర్పుగోదావరి: రాజమండ్రి కోటగుమ్మం సెంటర్, రామచంద్రాపురం రిలే దీక్షలు కొనసాగాయి. ఏలేశ్వరం, ప్రత్తిపాడుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తునిలో జరిగిన రిలే దీక్షల్లో కోటనందూరు మండల కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం, అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో దీక్షలను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రారంభించారు. ఏజెన్సీ, జగ్గంపేట, రాజానగరం, కరప మండలం, పిఠాపురం, అనపర్తి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
పశ్చిమ గోదావరి: జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్‌సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. తణుకు, ఆచంట తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
విశాఖ: పాడేరు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మాడుగులలో రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. విశాఖలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. తగరపువలసలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని తెలిపారు. చోడవరం, పాయకరావుపేటలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
విజయవాడ: కంకిపాడు ప్రధాన సెంటరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు.
ఒంగోలు: గిద్దలూరు, చీరాల, టంగుటూరు, సంతనూతల పాడు, గిద్దలూరు, దర్శి, చీరాల, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల్లో ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగాయి.
గుంటూరు: బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండ, తెనాలి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.