అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగోరోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగోరోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభమైంది.
గొల్లపల్లి వద్ద రైతుకూలీలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలుకరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ రుణాలను మాఫీ చేస్తామంటేనే టీడీపీకి ఓట్లేశామని, రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని తెలిపారు. హామీలతో చంద్రబాబు తమను మోసం చేశాడని వైఎస్ జగన్ వద్ద వాపోయారు. వర్షాలు సరిగా లేక పంటలు పండటం లేదని ఆవేదన వ్యక్త చేశారు. రైతులకు న్యాయం జరిగేలా పోరాడుతానని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.
వసంతపురం గ్రామ మహిళలు తమ సమస్యలను వైఎస్ జగన్ను వివరించారు. వేలి ముద్రలు పడట్లేదని అధికారులు రేషన్ సరుకులు ఇవ్వడం లేదని, ఈ పాస్ విధానం రద్దు చేయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మహిళలు కోరారు. అనంతరం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ జగన్ కు ఘనస్వాగతం పలికారు. చిగిచెర్లలో సత్యనారాయణ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.