బాల... ఏమిటీ గోల !

బాల... ఏమిటీ గోల !

- ప్రశ్నిస్తే వార్నింగ్‌.. లేదంటే బూతుపురాణం
- ఇంటింటికీ తెలుగుదేశంలో ఇదీ నేతల తీరు
- సమస్యలు చెప్పుకోవాలంటేనే బెంబేలెత్తుతున్న జనం
- ఎమ్మెల్యే తీరుతో పాటు తమ్ముళ్ల వైఖరిపై ప్రజల అసంతృప్తి

 
‘ఇంటింటికీ తెలుగు దేశం’ అంటూ ఎంతో ఆర్భాటంగా జనాల్లోకి వెళ్తున్న టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాము చెప్పిందే వినాలి తప్ప ఎదురు ప్రశ్నించకూడదన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కాదూ కూడదని మాట్లాడితే వార్నింగ్‌లు ఇప్పించేస్తున్నారు. లేదంటే బూతుపురాణాన్ని అందుకుంటున్నారు. వారి వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శింగనమల: తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్‌ యామినీబాలతో పాటు తెలుగు తమ్ముళ్లు గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలు విన్నవిస్తే వారిని నానా బూతులు తిట్టడం, ప్రశ్నించిన వారిపై తిరిగి పోలీసులను పంపి భయాభ్రాంతులకు గురి చేయడం వంటి వాటిని చేస్తుండటంపై అటు జనాలతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు.

ప్రశ్నిస్తే అంతే...!
గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో రైతులు, ప్రజలు హెచ్‌ఎల్‌సీ కాలువకు నీరు వదిలేలా చూడాలంటూ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే యామినీబాల, టీడీపీ నేతలను డిమాండ్‌ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే యామినీబాల ప్రశ్నించిన జనాలను విమర్శించిన సంగతి తెలిసిందే. మరో టీడీపీ నేత కూడా బూతుపురాణం అందుకోవడం అప్పుడే చర్చనీయాంశమైంది. దీన్ని ఇంకా మరువక ముందే తాజాగా శింగనమల మండలం రఘునాథపురంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రఘునాథపురం గ్రామంలో గురువారం ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన వృద్ధురాలు సుంకమ్మ ఇంటి దగ్గరకు వెళ్లి ఆమె సమస్యలను ఎమ్మెల్యే యామినీబాలనే స్వయంగా అడిగారు. దీంతో ఆమె నీళ్లు , పింఛన్లపై తమ ఆవేదనను ఆమె వెళ్లగక్కింది. నీళ్లు రాక నానా అవస్థలు పడుతున్నామని వృద్ధురాలు చెబుతుంటే... అంతే ఆవేశం దేనికమ్మా అంటూ ఎమ్మెల్యే ఆమెను వారించింది. అటుపై అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆ తర్వాత పోలీసులను పురమాయించి ఆ వృద్ధురాలి కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. మీ ఇంటికి ఫలానా పథకాలు అందించినా ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తారా.. మరోసారి ఇలా మాట్లాడొద్దని గద్దించారు. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలుచోట్ల కూడా ఇదే రీతిలో ప్రశ్నిస్తున్న జనాలను భయబ్రాంతులకు గురిచేస్తూ మేము చెప్పిందే వినాలని, లేకుంటే మీరు లబ్ధి పొందిన వివరాలు తెప్పించుకొని , వీటిని రికవరీ చేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇంటింటికీ టీడీపీలో నోరు తెరిచేందుకే జనం బెంబేలెత్తిపోతున్నారు.

సమస్యల అడిగితే బెదిరింపులా? - గోపాలు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, శింగనమల
ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చినప్పడు ప్రజలు సమస్యలను పరిష్కరించాలని అడగడం సహజం. అంతమాత్రనికే పోలీసులను పంపి  టీడీపీ నేతలు భయపెడుతున్నారు. ఇది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలా కాదు... ఇంటింటికీ వార్నింగ్‌లు ఇస్తున్నట్లుగా ఉంది.

సమస్యలు వినే ఓపిక లేకపోతే ఎలా? - చెన్నకేశవులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, శింగనమల
టీడీపీ నాయకులకు ప్రజా సమస్యలే వినే ఓపికే లేదు. గ్రామాల్లో ప్రజలు బాధలను చెప్పుకునే ప్రయత్నం చేస్తే వారిని బెంబేలెత్తించడం తగదు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఎలా? ఇప్పటికైనా యామినీబాల తన తీరును మార్చుకుంటే మేలు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top