
సీఎంకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానం
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. చైనాలో నిర్వహిస్తున్న ’న్యూ చాంపియన్స్-2015’ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రత్యేకంగా ఆహ్వానించింది.
చైనాలో జరిగే సదస్సులో పాల్గొనాలని లేఖ
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్.. చైనాలో నిర్వహిస్తున్న ’న్యూ చాంపియన్స్-2015’ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డెరైక్టర్ ఫిలిప్ రోస్లర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వాలు, మీడియా, అకాడమీ, పౌర సమాజాలకు సంబంధించిన దాదాపు 1,500 మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారు. నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. 2015లో అద్భుత ఫలితాలు సాధించిన ప్రగతి సాధకులు.. భావితరాలకు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈ వేదికపై దిశానిర్దేశం చేస్తారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అద్వితీయంగా అభివృద్ధి వైపు పరుగులెత్తిస్తున్న పని విధానానికి సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవాలని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఫిలిప్ రోస్లర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాల్లో జరిగే చర్చలో కేసీఆర్ అభిప్రాయాలు అవసరమనే ఉద్దేశంతోనే ఆహ్వానిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.
సీఎంతో పాటు వ్యాపార ప్రతినిధి బృందాన్ని కూడా వెంట తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో నడిచే అంతర్జాతీయ సంస్థగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు అధికారిక గుర్తింపు ఉందని.. ఈ నేపథ్యంలో సదస్సు సందర్భంగా ఉన్నత స్థాయిలో జరిగే చర్చలు సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు ఆర్థిక సుస్థిరతకు దోహదపడే విధంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన లేఖలో ప్రశంసించడం గమనార్హం.