మనిషిని భయపెట్టే సంకేతాలు నాలుగు. అందులో ఒంటరి జీవితం ఒకటి.
మనిషిని భయపెట్టే సంకేతాలు నాలుగు. అందులో ఒంటరి జీవితం ఒకటి. వైవాహిక జీవితంలో పిల్లలు కలగకపోగా, జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న భర్త మరణించడంతో ఆమె ఒంటరిదైంది. కూలినాలీ చేసుకుంటూ నాలుగేళ్లుగా ఎలాగోలా నెట్టుకువచ్చిన ఆమె ఇక ఒంటరితనాన్ని భరించలేకపోయింది. జీవితంపై విరక్తి పెంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన జయరాం భార్య ప్రమీల(32) బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... కొత్తచెరువుకు చెందిన ప్రమీల వివాహం బసంపల్లికి చెందిన జయరాంతో కొన్నేళ్ల కిందట అయింది. వారికి పిల్లలు లేరు. భర్త నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఆమె కూలి పనులకు వెళ్లి వచ్చిన అరకొర డబ్బుతో కాలం గడిపేది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఆమె ఉరేసుకుని తనువు చాలించింది. బుధవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఎస్‌ఐకు సమాచారం అందించారు. ఆయన తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఇరుగుపొరుగు వారిని విచారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యాయత్నం
కదిరి టౌన్ : కడుపునొప్పి తాళలేక తలుపులకు చెందిన ఓ యువకుడు బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. చిన్నప్ప కుమారుడు కిరణ్‌బాబు అవివాహితుడు. అయితే కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నొప్పి అధికం కావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మార క స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే వైద్యచికిత్సల నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.