వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది.
భూపాలపల్లి: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేస్తోందనే కారణంతో ఓ వృద్ధురాలిని ఆమె వరుసకు కుమారుడు అయ్యే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన చందుపట్ల పద్మ(69) చేతబడి చేస్తున్న కారణంగానే తన కుటుంబసభ్యులు అనారోగ్యం పాలవుతున్నారని ఆమె మరిది కుమారుడు చందుపట్ల శ్రావణ్‌రెడ్డి భావించేవాడు. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
అయితే, గత నెల 25వ తేదీన పద్మ తన పత్తిచేనులో ఉండగా శ్రావణ్‌రెడ్డి ఆమెను బండరాయితో మోది చంపేశాడు. శవాన్ని గోనెసంచిలో ఉంచి రాయిని కట్టి గ్రామ సమీపంలోని చెరువులో పడేశాడు. రక్తంతో తడిసిన తన దుస్తులను గ్రామ సమీపంలో దాచి పెట్టాడు. గురువారం సాయంత్రం శ్రావణ్‌రెడ్డి దుస్తులను గమనించిన గ్రామస్తులు అతడిని నిలదీశారు. దీంతో అతను భూపాలపల్లి పోలీసులకు లొంగిపోయాడు. అతడు చెప్పిన ఆనవాళ్ల మేరకు శుక్రవారం ఉదయం చెరువులో గాలించగా పద్మ శవం లభ్యమైంది. మృతురాలి కుమారుడు శ్రీరాంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.