
వాట్సప్ వైద్యం
గాయాలైన ప్రాంతాలను సెల్‌ఫోన్లలో ఫొటోలు దించి, వాట్సప్‌లో ఎక్కడో ఉన్న వైద్య నిపుణులకు పంపుతారు. ఆ ఫొటోలను పరిశీలించిన స్పెషలిస్టులు ఫోన్లో చెప్పినట్లుగా ఇక్కడి జూనియర్ వైద్యులు వైద్యం చేస్తారు.
రోగి ఫొటోలు సెల్‌ఫోన్లో తీసి.. వాట్సప్‌లో పంపి..
ఎక్కడో ఉన్న వైద్యుల సూచనల మేరకు వైద్యం
మంచిర్యాలలో కార్పొరేట్ హంగుల ఆసుపత్రుల్లో చోద్యం
రోడ్డు ప్రమాదంలో తలకు, ఛాతికి తీవ్ర గాయాలైన ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కార్పొరేట్ హంగులతో కూడిన ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య నిపుణులున్నట్లు బోర్డులు పెట్టడంతో ప్రభుత్వాసుపత్రిని వదిలి, ఈ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. బోర్డు మీద పేరున్నా.. తీరా అక్కడ వైద్యులు మాత్రం ఉండరు.. ఎంబీబీఎస్ డాక్టర్లే రోగిని పరీక్షించి, గాయాలైన ప్రాంతాలను సెల్‌ఫోన్లలో ఫొటోలు దించి, వాట్సప్‌లో ఎక్కడో ఉన్న వైద్య నిపుణులకు పంపుతారు. ఆ ఫొటోలను పరిశీలించిన స్పెషలిస్టులు ఫోన్లో చెప్పినట్లుగా ఇక్కడి జూనియర్ వైద్యులు వైద్యం చేస్తారు. అదృష్టం బాగుండి నయమైతే ఒక్క రోజులోనే రూ.50 వేల నుంచి రూ.లక్ష బిల్లు.., అదృష్టం బాగాలేక వైద్యం వికటించి ప్రాణం మీదికొచ్చిందంటే కరీంనగర్‌కు రెఫర్. - ఇదీ తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో కాసుల కోసం కొత్త పుంతలు తొక్కుతున్న కార్పొరేట్ హంగులతో కూడిన ఆసుపత్రుల్లో చోటు చేసుకుంటున్న చోద్యం
ఆదిలాబాద్: కేవలం రోగి ఫొటోలనే కాదు, ఆ రోగిని రోగ నిర్ధారణ రిపోర్టులను సైతం వాట్సప్‌లో పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్స్‌రేలు, గుండె నొప్పికి సంబంధించిన ఈసీజీలు, ఇతర నివేదికలు పంపి, వాటి ఆధారంగా ఇక్కడ వైద్యం చేస్తున్నారు. కళ్లు జిగేల్ మనిపించే లైట్లు.. ఇట్టే ఆకర్షించే బోర్డులు.. నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరికరాలు.. వైద్యుల బోర్డుపై గుండె నిపుణులు, ఆర్థోపెడిక్, సర్జన్, న్యూరో సర్జన్, న్యూరో ఫిజీషియన్, ఈఎన్‌టీ, పిడియాట్రిక్, న్యూరాలజిస్టు, ఎండీడీఎం.. ఇలా చాంతాడంత ప్రత్యేక వైద్య నిఫుణులున్నట్లు బోర్డులు. ఇలా అమాయకుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుని కాసులు దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలో పదుల సంఖ్యలో ఇలాంటి ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కానీ.. పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా ఆసుపత్రిలో చేర్పిస్తే ప్రత్యేక వైద్య నిపుణులు ఉండరు. కేవలం ఇద్దరు, ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్లతోనే కార్పొరేట్ కహానీ నడిపిస్తున్నారు. రోజులో 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలందిస్తామని చెబుతున్న ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు ఉండటం లేదు.
రూ.లక్షల్లో బిల్లులు..
ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ, బిల్లులు మాత్రం రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లోని ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా బెడ్ చార్జీలు, నర్సింగ్ చార్జీలు, వైద్య నిఫుణుల బిల్లులు, మందులు.. ఇలా రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అత్యసరం కావడంతో నిరుపేదలైతే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోంది.
ఏజెంట్లతో దందా..
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఒక్కో రోగిని రిఫర్ చేసినందుకు గాను, రోగి బిల్లుపై సదరు ఏజెంట్లకు రూ.వేలల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. కొన్ని ఆసుపత్రులైతే రోగి బిల్లుపై 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ కట్టబెడుతూ తమ వ్యాపారాన్ని మూడు బెడ్లు.. ఆరు పేషెంట్లు.. అన్న చందంగా కొనసాగిస్తున్నారు.