గొంతెండుతోంది మహాప్రభో..
నెల్లూరు(అర్బన్): కార్పొరేషన్లోనే పెద్ద డివిజనైన బుజబుజనెల్లూరులో పది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ చిన్నపాటి మరమ్మతులకు గురైన బాగుచేసే దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడంలేదు.
-
బుజబుజనెల్లూరులో తాగునీరు బంద్
-
పది రోజులుగా దుస్థితి
-
పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు
నెల్లూరు(అర్బన్): కార్పొరేషన్లోనే పెద్ద డివిజనైన బుజబుజనెల్లూరులో పది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ చిన్నపాటి మరమ్మతులకు గురైన బాగుచేసే దిశగా ఎవరూ చర్యలు తీసుకోవడంలేదు. ఈ ప్రాంతంలో దాదాపు 18 వేల మంది జీవనం సాగిస్తున్నారు. డివిజన్లో భూగర్భ జలాలు ఉప్పగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం 2009లో రూ.1.05 కోట్లతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.60 లక్షలతో ప్లాంట్‌ను నిర్మించారు. మిగిలిన మొత్తాన్ని నిర్వహణ, మరమ్మతుల కింద కేటాయించారు. అప్పటి నుంచి రూ.రెండుకే మినరల్ వాటర్‌ను అందిస్తున్నారు.
కార్పొరేషన్ నిర్లక్ష్యం
మరమ్మతులకు కార్పొరేషన్ నిధులను రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వాటర్ ప్లాంట్‌కు ఉండే నిధులతోనే మరమ్మతులను చేయించే అవకాశం ఉన్నా, కార్పొరేషన్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నీరు లేని తరుణంలో కిలోమీటర్ దూరంలోని ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్‌కు వెళ్లి రూ.15ను వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లలేనివారు రూ.25 ఖర్చు చేసి దుకాణాల్లో క్యాన్‌ను కొనుగోలు చేస్తున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలైనా పరిష్కారమయ్యేవని, కార్పొరేషన్లో విలీనమయ్యాక, సమస్యలతో సతమతమవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్లో విలీనమయ్యాక పాట్లు: రాణి, భగత్‌సింగ్‌కాలనీ, బుజబుజనెల్లూరు
పంచాయతీని కార్పొరేషన్లో విలీనం చేశాక మా ప్రాంతానికి అన్ని వసతులు వస్తాయనుకున్నాం. నీటి సమస్య ఉండదనుకున్నాం. అయితే విలీనమయ్యాకే కష్టాలు పెరిగాయి.
పది రోజులుగా నీళ్లివ్వకపోవడం అన్యాయం: బాషా, న్యూకాలనీ, బుజబుజనెల్లూరు
కొంతకాలంగా ఏవో సాకులు చెప్పి ఒక పూట నీరిస్తే మరో పూట ఇవ్వడం లేదు. ముందు రోజు చెప్పకుండానే మెయింటెనన్స్ పేరుతో ఉన్నట్లుండి నీటిని ఆపడం అలవాటుగా మారింది. ఇది చాలదన్నట్లు పదిరోజులుగా నీటిని ఇవ్వకపోవడం దారుణం.