విజయవాడ సిటీ స్క్వేర్‌కు చైనా డిజైన్ | vijayawada people fired on ap cm chandrababu over city square building | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ స్క్వేర్‌కు చైనా డిజైన్

May 23 2016 12:50 AM | Updated on Aug 18 2018 6:11 PM

విజయవాడ సిటీ స్క్వేర్‌కు చైనా డిజైన్ - Sakshi

విజయవాడ సిటీ స్క్వేర్‌కు చైనా డిజైన్

విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో సిటీ స్క్వేర్ నిర్మాణానికి చైనా కంపెనీ జీఐసీసీ తయారుచేసిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేశారు.

- ఖరారు చేసిన సీఎం చంద్రబాబు  
- స్వరాజ్య మైదానంలో స్క్వేర్ నిర్మాణానికి సన్నాహాలు
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్)లో సిటీ స్క్వేర్ నిర్మాణానికి చైనా కంపెనీ జీఐసీసీ తయారుచేసిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారుచేశారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులు, జీఐసీసీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో దీన్ని ఖరారు చేశారు. నగర సుందరీకరణలో భాగంగా ఈ సిటీ స్క్వేర్‌ను అత్యాధునికంగా నిర్మించనున్నట్లు  తెలిపారు. ఈ స్క్వేర్‌లో షాపింగ్ కాంప్లెక్సులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, వాకింగ్, సైకిల్ ట్రాక్‌లు, పార్క్ ఏర్పాటుచేస్తారు. పార్కింగ్ అండర్‌గ్రౌండ్‌లో ఉంటుంది.

సమావేశాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకునేందుకు గతం కంటే ఎక్కువ స్థలం సిటీ స్క్వేర్‌లో అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. వివిధ దశల్లో దీని నిర్మాణాన్ని పూర్తిచేస్తామని, పూర్తయిన తర్వాత ఇది పర్యాటకస్థలంగా మారుతుందని చెప్పారు. తద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ మైదానంలో ఉన్న రైతుబజారుకు బదులు అలంకార్ థియేటర్ సమీపంలో నాలుగు కోట్ల రూపాయలతో 350 స్టాళ్లతో మోడల్ రైతుబజారు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మైదానంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలను తొలగించాలని ఆయన ఆదేశించారు.

 జీఐసీసీకి నిర్మాణ బాధ్యతలు!
 సిటీ స్క్వేర్ డిజైన్‌ను రూపొందించిన జీఐసీసీ కంపెనీకే నిర్మాణ బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉంది. పీపీపీ విధానంలో దీన్ని ఆ కంపెనీకి ఇవ్వడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. స్వరాజ్య మైదానాన్ని సిటీ స్క్వేర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినా నిధులు లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కంపెనీయే నిర్మాణానికి పెట్టుబడి పెట్టి దాన్ని రాబట్టుకునేందుకు కొన్నేళ్లపా టు నిర్వహిస్తుంది. సిటీ స్క్వేర్‌లో ప్రతి దానికి ఫీజు విధించనున్నారు. దీనికి చెందిన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement