ప్రకృతిని ప్రేమిద్దాం.. పుడమి పరిరక్షిద్దాం | tomorrow Earth Hour Day | Sakshi
Sakshi News home page

ప్రకృతిని ప్రేమిద్దాం.. పుడమి పరిరక్షిద్దాం

Mar 24 2017 2:16 AM | Updated on Sep 5 2017 6:54 AM

ప్రకృతిని ప్రేమిద్దాం.. పుడమి పరిరక్షిద్దాం

ప్రకృతిని ప్రేమిద్దాం.. పుడమి పరిరక్షిద్దాం

ఉరుకుల పరుగుల జీవితం.. పెరుగుతున్న వాహన వినియోగం.. వెరసి ముంచుకొస్తున్న కర్బన ఉద్గార ఉపద్రవం

రేపు ఎర్త్‌ అవర్‌ డే
నేడు విద్యార్థులకు వివిధ పోటీలు
ఈ ఏడాది తిరుపతిలో..


ఉరుకుల పరుగుల జీవితం.. పెరుగుతున్న వాహన వినియోగం.. వెరసి ముంచుకొస్తున్న కర్బన ఉద్గార ఉపద్రవం.. తరుగుతున్న ఇంధనం. ఫలితంగా తాగే నీరు.. పీల్చే గాలి.. నివశించే నేల కాలుష్యకాటుకు గురవుతోంది. ఈ పరిణామంతో ప్రకృతి అందాలను కోల్పోతోంది.. పుడమి క్షోభిస్తోంది. ఈ దుస్థితి నుంచి భూమాతను కాపాడి.. మానవ మనుగడకు తోడ్పాటునందించడం అన్నది ఒక్కరితో సాధ్యం కాదు.   స్వచ్ఛందంగా ఎవరికి వారు నడుం బిగించాలి. శనివారం ఎర్త్‌ అవర్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

తిరుపతి ఎడ్యుకేషన్‌: సౌరకుటుంబంలోని గ్రహాల్లో జీవరాశులు జీవించడానికి అనువైన గ్రహం భూమి మాత్రమే.  జీవించడానికి అవసరమైన నీరు భూమి మీద మాత్రమే లభిస్తుంది. దీని ఫలితంగానే జీవరాశుల మనుగడ ఈ గ్రహంపై మాత్రమే ఉంది. జీవ మనుగడకు దోహదం చేస్తున్న గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం ఈ పంచభూతాల ఆవశ్యకతను మన పెద్దలు గుర్తించి, దైవంతో సమానంగా పూజలు చేయడం  ప్రారంభించారు.

అయితే పారిశ్రామిక విప్లవం తరువాత భూవాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని వందల సంవత్సరాల తరువాత భూమి నివాసానికి పనికిరాదనే సూచనలు మానవజాతి మనుగడకే ప్రశ్నార్థకమవుతోంది. ఇతర గ్రహాలపై జీవరాశిని కనుగొనడానికి పరిశోధనలు చేస్తున్న మనం భూమిపై ఉన్న జీవరాశిని అపాయకర స్థితికి నెట్టేస్తున్నామని పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు.

ఎర్త్‌ అవర్‌ ఉద్దేశం
భూమిపై వెలువడుతున్న కర్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధనాలు, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం రూపుదిద్దుకున్న ప్రజాచైతన్య ఆచరణే ఎర్త్‌ అవర్‌. ప్రకృతిని ప్రే మించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలని మాటలు చె ప్పడం కాకుండా ఆచరణలో పెట్టడమే ఎర్త్‌ అవర్‌  ఉద్దేశం.

ఏం చేయాలి
ప్రతి ఏడాది మార్చి 25వ తేదీ రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గృహాలు, వాణిజ్య సముదాయాలు, వ్యా పార కేంద్రాలు, పార్కులు తదితర అన్ని ప్రాంతాల్లో (వీధి దీపాలు మినహా) విద్యుత్‌ దీపాలను స్వచ్ఛందంగా ఆపి ఉంచాలి. అలాగే ఇంట్లో టీవీలను కట్టేయాలి. భూమి ని కాపాడుకోవాలని భావించే ప్రతి వ్యక్తి స్వతహాగా ఎర్త్‌ అవర్‌ను పాటిస్తూ పొరుగువారిని ప్రోత్సహించాలి. ఎర్త్‌ అవర్‌పై అవగాహన కల్పించేందుకు 25వ తేదీ రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు.

విద్యార్థుల్లో అవగాహన
నేటి విద్యార్థులే...రేపటి పౌరులు. దీని కోసమే ఎర్త్‌ అవర్‌ ఉద్దేశాన్ని విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నదే ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ గ్రీన్‌ కోర్‌(ఎన్‌జీసీ). ఎన్‌జీసీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో 250 ఉన్నత పాఠశాలల్లో పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. అలాగే పర్యావరణ దినోత్సవాలను నిర్వహిస్తోంది.

ఈ ఏడాది తిరుపతిలో...
తిరుపతిలో ఈ ఏడాది ఎర్త్‌ అవర్‌ను నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ, తిరుపతి నగరపాలక సంస్థ,  రీజినల్‌ సైన్స్‌ సెంటర్, లయన్స్‌ క్లబ్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్, ఏపీఎస్పీడీఎల్‌ ఇంజినీర్ల సంఘం, ఆల్‌ ఇండియా రేడియో సహకారంతో ఎన్‌జీసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎర్త్‌ అవర్‌ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఎర్త్‌ అవర్‌ ప్రధానాంశంగా  చిత్రలేఖనం, సెమినార్, వ్యాసరచనల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ దేవేంద్రనా«థ్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.

2007లో ఎర్త్‌అవర్‌...
ఓ  వైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు అభివృద్ధి పేరుతో సృష్టిస్తున్న విధ్వంసానికి తోడుగా నాగరికత పేరుతో పెరిగిన వాహనాల వాడకం, విద్యుచ్ఛక్తి వలన పునరుద్ధరించలేని స్థితికి ఎన్నో వనరులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే భూమిని కాపాడుకోవడం కోసం ఒకరిద్దరి మదిలో మెది లిందే ఎర్త్‌ అవర్‌. 2007, మార్చి నెలలో ఎర్త్‌ అవర్‌ ఉద్యమం తొలుత ఆస్ట్రేలియాలో రూపుదాల్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మార్చి 25న ఎర్త్‌ అవర్‌ను పాటిస్తున్నారు. ఉద్యమ నిర్మాతలు లీబర్నెట్, ఆండీరిడ్లీ.

తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ
తిరుపతి నగరంలో శనివారం రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు ఎర్త్‌ అవర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. మున్సిపల్‌ కార్యాలయం, అలిపిరి సర్కిల్, అన్నమయ్య సర్కిల్, కపిలతీర్థం సర్కిల్, ముత్యాలరెడ్డిపల్లె సర్కిల్, మహతి ఆడిటోరియం, లీలామహల్‌ సర్కిల్, తిరుచానూరు ఫ్లైవర్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement