నేడే పోలింగ్‌ | today mlc poling | Sakshi
Sakshi News home page

నేడే పోలింగ్‌

Mar 9 2017 12:19 AM | Updated on Jun 1 2018 8:39 PM

నేడే పోలింగ్‌ - Sakshi

నేడే పోలింగ్‌

పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనుంది.

- ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం ​సిద్ధం
- 190 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు
- పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక‌్షన్‌

 
అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనుంది. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 190 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకునేందుకు 253 మంది ప్రిసైడింగ్‌, 217 మంది అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, 460 మంది పోలింగ్‌ సిబ్బంది, 41 మంది సెక్టోరల్‌, 41 మంది రూట్‌ అధికారులను నియమించారు.

పోలింగ్‌ కేంద్రాలను 41 రూట్‌లుగా విభజించి, ఎన్నికల సామగ్రిని పోలీసు బందోబస్తు మధ్య బుధవారం సాయంత్రం తరలించారు. ఈ ప్రక్రియను ఆర్డీఓలు పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ సామగ్రి పంపిణీ, పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ కోన శశిధర్‌ సందర్శించారు. అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో 144 సెక‌్షన్‌ అమలు చేస్తున్నారు. కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఈ పరిధిలో  అభ్యర్థులు ఓట్లు అడిగినా, ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటారు. జిల్లావ్యాప్తంగా 190 పోలింగ్‌ కేంద్రాల్లోనూ లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది. పోలింగ్‌ సరళిని నేరుగా ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తుంది. జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వీక్షిస్తారు. ప్రతి కేంద్రంలోనూ ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉండి, ఎప్పటికప్పుడు నివేదిక (డైరీ)ను ఎన్నికల పరిశీలకులకు అందిస్తారు.

96,698 మంది ఓటర్లు
పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు జిల్లాలో 96,698 మంది ఉన్నారు. వీరిలో పట్టభద్రులు 88,823 మంది, ఉపాధ్యాయులు 7,875 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.అలాగే పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పట్టభద్ర  బరిలో 25 మంది, ఉపాధ్యాయ బరిలో 10 మంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement