గుత్తి శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.
♦ రెండు లారీలు, ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి
గుత్తి రూరల్ : గుత్తి శివార్లలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు లారీలు, ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. లారీ డ్రైవర్ల వద్దనున్న రూ.28 వేల నగదును దోచుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటకు చెందిన అశోక్‌రెడ్డి, క్లీనర్ బాలుతో కలసి ఖాళీ సీసాల లోడుతో బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని గుత్తి మండలం కరిడికొండ వద్ద లారీ పక్కకు ఆపి నిద్రించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ముగ్గురు గుర్తు తెలియని యువకులు లారీపై ఒక్కసారిగా రాళ్లు రువ్వి డ్రైవర్ అశోక్‌రెడ్డి, క్లీనర్ రెహమాన్‌బాషాను భయభ్రాంతులకు గురి చేశారు.
ఆ తరువాత కత్తులతో భయపెట్టి వారి వద్దనున్న రూ.8 వేల నగదు దోచుకెళ్లారు. కరిడికొండలో జితేంద్రనాయుడు తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌నూ ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి కొత్తపేట వద్ద బెంగళూరు నుంచి కోకాకోలా కూల్ డ్రింక్సుకు సంబంధించిన ఫ్రీజ్‌ల లోడుతో హైదరాబాదుకు వెళ్తున్న లారీపై దాడి చేశారు. లారీ రోడ్డు పక్కకు ఒరగడంతో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లా తొరియూరుకు చెందిన డ్రైవర్ మోహన్‌రాజు, క్లీనర్ బాలుపై దాడి చేశారు. డ్రైవర్ మోహన్‌రాజు ప్రతిఘటించగా దొంగలు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అతని తొడపై పొడిచారు. దీంతో అతను కుప్పకూలడంతో అతని వద్దనున్న రూ.20 వేల నగదు నొక్కేశారు. గాయపడ్డవారు స్థానికుల సహాయంతో గుత్తి పోలీసుస్టేçÙన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
దొంగల బైక్‌ను పట్టుకున్న లారీ డ్రైవర్, క్లీనర్
దోపిడీ అనంతరం దొంగలు పారిపోయేందుకు ఉపయోగించిన బైక్‌ను డ్రైవర్ అశోక్‌రెడ్డి, క్లీనర్ రెహమాన్‌బాషా పట్టుకున్నారు. వారిద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విషయం లారీ యజమానికి చెప్పారు. యజమాని సూచన మేరకు వారు బెంగళూరుకు బయలుదేరి వెళ్లగా పామిడి దాటిన అనంతరం దొంగలు బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన ఆగి చూసుకుంటున్నారు. క్లీనర్ రెహమాన్ బాషా దొంగలను గుర్తించి డ్రైవర్‌కు చెప్పడంతో వారు లారీని తిప్పుకొని వచ్చి వారిపైకి దూసుకెళ్లారు. ఇది గమనించిన దొంగలు బైక్‌ను వదిలేసి పక్కనున్న చెట్ల పొదల్లోకి పారిపోయారు. ఆ తరువాత కాసేపటికి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాగా దొంగలు రాళ్లు రువ్వారు. అయితే బస్సును ఆపకపోవడంతో అక్కడ ఎలాంటి చోరీ జరగలేదు.