ఖాజీపేట మండలం మల్లాయపల్లె గ్రామంలో యాండ్ల రాజన్న (42) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గురువారం సాయంత్రం మృతి చెందాడు.
ఖాజీపేట : ఖాజీపేట మండలం మల్లాయపల్లె గ్రామంలో యాండ్ల రాజన్న (42) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గురువారం సాయంత్రం మృతి చెందాడు. అప్పనపల్లె– రంగాపురం గ్రామ మధ్యలో ఉన్న వక్కిలేరు కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మల్లాయపల్లె గ్రామానికి చెందిన యాండ్ల రాజన్నగా పోలీసులు గుర్తించారు. అయితే ఒంటినిండా తీవ్ర గాయాలు కావడంతో ఎవరైనా హతమార్చారా? లేక మద్యం మత్తులో కిందపడి మృతి చెందాడా అనే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. మృతుడిది జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుండ్లకుంట ప్రాంతమని తెలిసింది. అయితే ఇల్లరికం కారణంగా ఇతను మల్లాయపల్లె గ్రామంలో నివాసముంటున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.