చేనేత వ్యాపారాలు బంద్‌ | textiles business bundh | Sakshi
Sakshi News home page

చేనేత వ్యాపారాలు బంద్‌

Jul 23 2017 10:54 PM | Updated on Aug 11 2018 7:29 PM

చేనేత వ్యాపారాలు బంద్‌ - Sakshi

చేనేత వ్యాపారాలు బంద్‌

శ్రావణ మాసం.. శుభముహూర్తాల సీజన్‌..ఈ సీజన్‌ వెళ్లిపోతే మరో మూడు నెలలు ఖాళీగా ఉండాల్సిందే.

- నేటి నుంచి నేతన్నల పోరుబాట
–జీఎస్టీ ఎత్తివేసేవరకూ కొనసాగనున్న ఆందోళనలు
–రూ. కోట్లలో నిలిచిపోనున్న వ్యాపార లావాదేవీలు
–శుభమూహార్తాల సీజన్‌లో వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు


ధర్మవరం: శ్రావణ మాసం.. శుభముహూర్తాల సీజన్‌..ఈ సీజన్‌ వెళ్లిపోతే మరో మూడు నెలలు ఖాళీగా ఉండాల్సిందే.. ఇటువంటి పరిస్థితుల్లో చేనేతలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు..చేనేత రంగంపై జీఎస్టీ భారం ఎత్తివేసేవరకూ చేనేతకు సంబంధించిన ఏ లావాదేవీ నిర్వహించమని, అప్పటి దాకా ఏ ఒక్క శిల్క్‌హౌస్‌ను తెరవబోమని తేల్చిచెబుతున్నారు. దీంతో దాదాపు రోజూ కోట్లలో టర్నోవర్‌ జరిగే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది.

ధర్మవరం పట్టణంలో దాదాపు 2,000 శిల్క్‌హౌస్‌లు ఉన్నాయి..వీటిలో సాధారణ పరిస్థితుల్లో అయితే రూ. 5 కోట్ల నుంచి సీజన్‌లో అయితే ప్రతి రోజూ దాదాపు రూ.25 కోట్ల మేర టర్నోవర్‌ జరుగుతుంది. సరాసరిగా ఇక్కడ ప్రతి రోజూ పట్టుచీరల విక్రయం/ కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ. 10 కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చేనేత ముడిసరుకులైన పట్టు దారంపై 5 శాతం, జరీపై 12 శాతం, పట్టుచీరల విక్రయంపై 5 శాతం జీఎస్టీని విధించింది. దీంతో ఇటు చేనేత కార్మికులపైనా, అటు వస్త్ర వ్యాపారులపైనా భారం పడుతోంది. ఇప్పటి దాకా చేనేతకు సంబంధించిన లావాదేవీలపై ఎటువంటి పన్నులు విధించిన దాఖలాలు లేవు. అయితే జీఎస్టీ అమలులో భాగంగా చేనేత రంగాన్ని కూడా ఇందులో చేర్చడం పట్ల చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత రంగంపై జీఎస్టీని ఎత్తివేసే వరకూ తాము వ్యాపారలావాదేవీలు నిర్వహించబోమంటున్నారు. రోజుకో రీతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

కోట్లలో నష్టం
చేనేతల నిరవధిక బంద్‌ నిర్ణయంతో చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదముంది. ముఖ్యంగా శ్రావణమాసం శుభమూహూర్తాల సీజన్‌.. ఈ సీజన్‌లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు పట్టు వస్త్రాల కొనుగోలు అధికంగా ఉంటాయి. ఇటుపరిస్థితుల్లో నిరవధిక బంద్‌ చేస్తే చేనేత పరిశ్రమకు రూ. కోట్లలో నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. మరోవైపు వినియోగదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒక సీజన్‌ వెళ్లిపోతే మూడు నెలల పాటు చీరలను నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయకపోతే చేనేత రంగానికే ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది.

జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలి
చేనేత రంగంపై ఇప్పటి వరకు పన్నులు విధించ లేదు. ఇప్పటికే చేనేత రంగం సంక్షోభంతో కనుమరుగైపోతోంది. జీఎస్టీ అమలైతే చేనేతలు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలి. అంతవరకూ పోరాడుతాం.
- మామిళ్ల ప్రసాద్, శిల్క్‌హౌస్‌ యజమాని, ధర్మవరం

చేనేతరంగానికి పెద్ద దెబ్బ
జీఎస్టీ అమలైతే చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే «ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ అమలు మరింత భారం కానుంది. చేనేత రంగాన్ని జీఎస్టీ నుంచి ఉపసంహరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాలకు రూపకల్పన చేస్తున్నాం. ఎత్తివేసే వరకూ పోరాడుతాం.
-చందా రాఘవ, మాస్టర్‌ వీవర్‌, ధర్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement