బోధిస్తున్నారా?.. బడి ఎగ్గొడుతున్నారా? | teachers details with photos | Sakshi
Sakshi News home page

బోధిస్తున్నారా?.. బడి ఎగ్గొడుతున్నారా?

Aug 21 2016 10:20 PM | Updated on Sep 4 2017 10:16 AM

బోధిస్తున్నారా?.. బడి ఎగ్గొడుతున్నారా?

బోధిస్తున్నారా?.. బడి ఎగ్గొడుతున్నారా?

‘మీ గ్రామంలోని పాఠశాలకు అక్కడ నియమించిన ఉపాధ్యాయుడే వస్తున్నారా? ఆయనకు బదులు వేరొక ప్రైవేటు వ్యక్తి బోధిస్తున్నారా? మీ పాఠశాలలో ఎవరు ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో తెలుసా? మీ ఉపాధ్యాయులు తరచూ పాఠశాలకు ఎగనామం పెడుతున్నారా? మీ పాఠశాలలో నకిలీ ఉపాధ్యాయులు బోధిస్తున్న విషయం మీకు తెలుసా?’.

  • ఉపాధ్యాయుల నిగ్గు తేల్చేందుకు విద్యాశాఖ యత్నం
  • ఫొటోలతో సహా వివరాలు ప్రదర్శించాలని ఆదేశం
  • 4 వేల పైగా స్కూళ్లకు పదుల సంఖ్యలోనే అమలు
  •  
    రాయవరం :
    ‘మీ గ్రామంలోని పాఠశాలకు అక్కడ నియమించిన ఉపాధ్యాయుడే వస్తున్నారా? ఆయనకు బదులు వేరొక ప్రైవేటు వ్యక్తి బోధిస్తున్నారా? మీ పాఠశాలలో ఎవరు ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో తెలుసా? మీ ఉపాధ్యాయులు తరచూ పాఠశాలకు ఎగనామం పెడుతున్నారా? మీ పాఠశాలలో నకిలీ ఉపాధ్యాయులు బోధిస్తున్న విషయం మీకు తెలుసా?’.. బహుశా చాలామంది తల్లిదండ్రులకు అలాంటి ప్రశ్నల గురించి ఊహించే ఉండరు. అయితే అలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్నది వాస్తవం. అందుకే వీటికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. ఇకపై ఆ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల వివరాలు ఫొటోలతో సహా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విధానం వలన నకిలీ ఉపాధ్యాయులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. 
    బోధన మాని ఇతర వ్యాపకాలు
    చాలా చోట్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా వారి స్థానంలో వేరొకరిని నియమించి వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు చేపడుతున్నట్లుగా విద్యాశాఖాధికారుల పరిశీలనలో తేలింది. నాణ్యమైన విద్య అందక పోవడానికి ఇదొక కారణంగా గుర్తించారు. ఇటువంటి వారికి చరమగీతం పాడే చర్యల్లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలు, వారి ఫొటోలు, ఏ సబ్జెక్టులు బోధిస్తారు, విద్యార్హతలు, గ్రేడింగ్‌ స్థాయి తదితర వివరాలను పాఠశాలల్లోని గోడపై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు.  క్షేత్రస్థాయిలో ఈ ఆదేశం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో 4,144 పాఠశాలలు ఉండగా కేవలం పదుల సంఖ్యలోనే వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. 
    అమలు వలన ప్రయోజనాలివే..
    కొన్ని పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులు స్వంత పనులకు పరిమితమై వారి స్థానంలో వేరొకరిని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు ప్రదర్శిస్తే కచ్చితంగా వారే బోధిస్తారు. రాజకీయ పలుకుబడితో విధులకు గైర్హాజరయ్యే వారు ఉన్నారు. స్థానికులు, అధికారులు పాఠశాలలను సందర్శించే సమయంలో ఫొటోల ఆధారంగా గైర్హాజరును గుర్తించే అవకాశం ఉంటుంది. అధికారుల ఆకస్మిక తనిఖీ సమయంలో ఎవరున్నారు, గ్రేడింగ్‌ స్థాయిని గుర్తించే వీలుంటుంది. ఏ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో తెలుస్తుంది. ఆయన బోధనలో ఎక్కడైనా లోపాలుంటే అక్కడికక్కడే సూచనలిచ్చి నైపుణ్యాలను మెరుగుపర్చవచ్చు. ఉపాధ్యాయుల్లోనూ బాధ్యత పెరుగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తారనే భావన కలగడంతో క్రమశిక్షణ పెరుగుతుంది. పాఠశాల పనివేళల్లో తరగతి గదిలో ఉండడంతో మెరుగైన బోధన అందుతుంది. ఫలితంగా ప్రమాణాలు పెరుగుతాయి. 
    23, 24 తేదీల్లో తనిఖీలు..
    ఉపాధ్యాయుల ఫొటోలతో కూడిన వివరాలను కచ్చితంగా ప్రదర్శింనదీ, లేనిదీ తెలుసుకునేందుకు ఈ నెల 23, 24 తేదీల్లో విద్యాశాఖ బృందాలు పాఠశాలలను సందర్శించనున్నాయి. ప్రతి పాఠశాలలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్‌ఎంల సమావేశంలో మండల విద్యాశాఖాధికారులు సూచించారు. ఆ మేరకు ఉపాధ్యాయుల వివరాలను ప్రదర్శించారో, లేదో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టనున్నారు.  
     
    అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి..
    పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు, విద్యార్హతల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని  ఆదేశాలు ఇచ్చాం. 23, 24 తేదీల్లో ఇదే అంశంపై తనిఖీలు కూడా నిర్వహిస్తాం. 
    – ఆర్‌.నరసింహారావు, డీఈఓ 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement