వామ్మో...! పెద్ద స్కెచ్‌ | TDP Big plan on Transco | Sakshi
Sakshi News home page

వామ్మో...! పెద్ద స్కెచ్‌

Feb 8 2017 10:54 PM | Updated on Aug 10 2018 8:23 PM

వామ్మో...! పెద్ద స్కెచ్‌ - Sakshi

వామ్మో...! పెద్ద స్కెచ్‌

ట్రాన్స్‌కో నిబంధనలను మార్చి కాంట్రాక్టు దక్కించుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న నానా యాగీ వెనుక పెద్ద కథే ఉంది.

సాక్షి, అమరావతి బ్యూరో : ట్రాన్స్‌కో నిబంధనలను మార్చి కాంట్రాక్టు దక్కించుకునేందుకు టీడీపీ ప్రజాప్రతినిధి చేస్తున్న నానా యాగీ వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు రూ.640 కోట్ల కాంట్రాక్టులను ఏక పక్షంగా దక్కించుకునే  ‘దూరా’లోచన బట్టబయలవుతోంది. ఆ కథాకమామిషు ఇది.... ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ కాంట్రాక్టుల కోసం విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి పెద్ద గూడుపుఠాణీ సాగిస్తున్నారు. మొగల్రాజపురంలో రూ.10కోట్లతో నిర్మించదలచిన గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ కోసం ఆయన ఒత్తిడి చేస్తున్న వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘పార్టీ మాదే... టెండర్‌ మాకే’ శీర్షికన బట్టబయలు చేసింది. అర్హత నిబంధనలు మార్చి  తమకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ఆయన పట్టుబట్టడం వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంది. అదేమిటంటే...

రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్లు నిర్మించాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది. మొగల్రాజపురంలోని సబ్‌స్టేషన్‌ కంటే అధిక సామర్థ్యమైనవి నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాజధాని ప్రాంతంలో 220 కేవీ సబ్‌స్టేషన్లు  16 నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ అంచనా వ్యయం రూ.40 కోట్లు చొప్పున మొత్తం రూ.640కోట్లుతో నిర్మిస్తారు. అమరావతిలో మొదటి సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం ఈ నెలలో టెండర్లు పిలవాలని ట్రాన్స్‌కో భావిస్తోంది. అనంతరం మిగిలిన 15 సబ్‌స్టేషన్ల  కోసం కూడా రానున్న రెండేళ్లలో దశలవారీగా టెండర్ల ప్రక్రియ చేపడతారు. రూ.640 కోట్ల భారీ కాంట్రాక్టు కావడంతో టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను వాటిపై పడింది.

అందుకే ప్రజాప్రతినిధి వీరంగం...
గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ కోసం ట్రాన్స్‌కో రూపొందించిన నిబంధనలు టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రతికూలంగా ఉన్నాయి. ప్రస్తుతం మొగల్రాజపురం టెండర్‌ నోటిఫికేషన్‌లో అర్హత నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించిన అనుభవం ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధి ఓ సంస్థ పేరున టెండరు దక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆ సంస్థకు కూడా గతంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించిన అనుభవం లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.10కోట్ల మొగల్రాజపురం సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం ఆ సంస్థ పోటీపడ లేదు. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోదు. అమరావతిలో నిర్మించనున్న 16 సబ్‌స్టేషన్లకూ అవే టెండర్‌ నిబంధనలు వర్తింపజేస్తారు.

అలా అయితే ఆ రూ.640కోట్ల భారీ కాంట్రాక్టు కూడా టీడీపీ ప్రజాప్రతినిధికి దక్కకుండాపోతుంది. అందుకే ప్రస్తుతం మొగల్రాజపురం సబ్‌స్టేషన్‌ టెండర్‌ నిబంధనలు మార్చాలని ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. గతంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించిన అనుభవం లేని సంస్థలు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించిన అనుభవం లేని సంస్థలకు అవకాశం కల్పించడం సరైన విధానం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఓ వైపు  రాజధానిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం... మరోవైపు సబ్‌స్టేషన్ల వంటి కీలకమైన మౌలిక వ్యవస్థల నిర్మాణంలో రాజకీయాలకు తలొగ్గుతోందని విమర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement