రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం | sp pressmeet in anantapur | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం

May 4 2017 11:58 PM | Updated on Jun 1 2018 8:39 PM

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పని చేయాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు.

అనంతపురం సెంట్రల్‌ : రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పని చేయాలని అనంతపురం రేంజ్‌ డీఐజీ ప్రభాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో రహదారుల భద్రత అనే అంశంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి డీఐజీ ప్రభాకర్‌రావు మాట్లాడారు. అమరావతిలో హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అన్ని జిల్లాల అధికారులతో బుధవారం  సమావేశం నిర్వహించారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలో గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై విశ్లేషించినట్లు తెలిపారు. అన్ని జిల్లాల కంటే అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై ప్రశంసలు వచ్చాయన్నారు.

అయితే మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేసి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో రోడ్డు భద్రతపై సమావేశం జరుగుతుందన్నారు. పోలీసుశాఖతో పాటు ఇతర శాఖలు కూడా పాల్గొంటాయన్నారు. ప్రభుత్వ అనుబంధ శాఖలను సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలు నివారించడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో అన్ని రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై  అధ్యయనం చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు తరుచూ వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్, హెల్మెట్‌ ధరించేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఓవర్‌లోడ్‌ వెల్లే వాహనాలను, రాంగ్‌ డైరెక‌్షన్‌లో వచ్చే వాహనాలు, ఇసుక మాఫియాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని హెచ్చరించారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని జియోట్యాగింగ్‌ చేయాలని, సీపీఓ సేవలు వినియోగించుకోవాలని, డేంజర్‌ జోన్స్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement