భారత సైన్యంలో మాతృభూమికై విశిష్టసేవలు అందిస్తున్న వీరజవానుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు.
అనంతపురం సెంట్రల్ : భారత సైన్యంలో మాతృభూమికై విశిష్టసేవలు అందిస్తున్న వీరజవానుల త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అధికారులు, మాజీ సైనికులు సంయుక్తంగా హుండీ ద్వారా విరాళాల సేకరణ కార్యక్రమాన్ని క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 7న త్రిసాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. ప్రతి పౌరుడు సంఘీభావంగా పాల్గొని త్రిసాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం అందించాలని కోరారు.
అంతకు ముందు త్రిసాయుధ దళాల పతాక దినోత్సవ విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు సైనిక సంక్షేమశాఖ కార్యాలయం నుంచి ర్యాలీగా టవర్‌క్లాక్, రఘువీరాటవర్స్, సప్తగిరి సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమశాఖ ఉద్యోగులు శేషగిరి, గిరీష్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కెప్టెన్ షేకన్న, నాయకులు బలరాంరావు, ఎన్‌సీసీ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, బద్రీనాథ్, రమణ, వివిధ కళాశాల విద్యార్థులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.