మాన్యం భూములపై స్వార్థపరుల కన్ను | selfish target to temple lands | Sakshi
Sakshi News home page

మాన్యం భూములపై స్వార్థపరుల కన్ను

Jul 29 2017 10:49 PM | Updated on Sep 5 2017 5:10 PM

పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందేందుకు కొందరు స్వార్థపరులు అక్కదేవతల మాన్యాన్ని కైవసం చేసుకునటి పట్టాలు చేయించుకున్నారు.

నల్లమాడ: పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందేందుకు కొందరు స్వార్థపరులు అక్కదేవతల మాన్యాన్ని కైవసం చేసుకునటి పట్టాలు చేయించుకున్నారు. మండల పరిధిలోని సోమగుట్టపల్లి వద్ద నల్లమాడ రెవెన్యూ పొలం సర్వే నంబర్  963లో 30 ఎకరాల పైబడి విస్తీర్ణం ఉంది. ఇందులో కొంత పట్టా భూమి ఉండగా.. అధికశాతం బండ, రాళ్లకుప్పలు ఉన్నాయి. ఇక్కడే అక్కదేవతల గుడి కూడా ఉంది. తమ పూర్వీకులు అక్కమ్మ గారి మాన్యం కింద గుట్టను వదిలేసినట్లు గ్రామస్తులు చెబుతుండగా, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తరము కట్టని గయ్యాళిగా నమోదై ఉంది.

స్వార్థపరుల కన్ను:
రెవెన్యూ రికార్డుల్లో ఒకేచోట 30 ఎకరాలు గయ్యాళి భూమి ఉండటాన్ని పసిగట్టిన కొందరు స్వార్థపరులు దానిపై కన్నేశారు. అధికారం, పలుకుబడి, హోదాతో రెవెన్యూ అధికారులను లోబర్చుకొని నల్లమాడకు చెందిన కొందరు 17.10 ఎకరాలను వన్‌బీ, అడంగల్‌లో తమ పేరున నమోదు చేయించుకున్నారు. వన్‌బీ ఆధారంగా బ్యాంకుల్లో పంటరుణాలు పొంది, పంటనష్ట పరిహారం, బీమా స్వాహా చేస్తున్నారు. ఇందులో అధికార టీడీపీకి చెందిన ఓ మైనార్టీ నాయకుడూ ఉన్నారు. తాతల కాలం నుంచి సాగుచేసుకొంటున్న పట్టా భూమిని కూడా వీరు కాజేయడంతో తాము నష్టపోతున్నామని గ్రామానికి చెందిన కొందరు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

గుట్టకు పట్టాలు ఎలా ఇస్తారు?
సర్వే నంబర్‌ 963లో సాగుభూమి లేకపోగా గుట్టకు అధికారులు పట్టా ఎలా ఇస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్కదేవతల మాన్యం కింద వదిలేయడంతో సాగుభూమి తయారు చేసుకునేందుకు అవకాశం ఉన్నా తాము అందులో ప్రవేశించలేదని తెలిపారు. పశువులను మేత కోసం గుట్టలో తోలుతుంటామని, ఎవరికో పట్టాలు ఇస్తే తాము పశువులను ఎక్కడ మేపాలని నిలదీస్తున్నారు. మామూళ్లకు ఆశపడి అధికారులు ఇతరులకు పట్టాలు ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ ఏఎస్‌ హమీద్‌ బాషా దృష్టికి తీసుకెళ్లగా తరము కట్టని గయ్యాళి విస్తీర్ణంలో ఇతరులకు హక్కు కల్పించిన విషయం తనకు తెలియదని, గ్రామస్తులు ఫిర్యాదు అందజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement