అధికార పార్టీ నేతల దౌర్జన్యం | ruling party Leaders collapsed the ysrcp leaders house | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతల దౌర్జన్యం

Apr 12 2017 3:18 PM | Updated on Sep 5 2017 8:36 AM

వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందినవారు అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు.

► నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతల ఇల్లు కూల్చివేత
►ఎర్రచందనం స్మగ్లర్‌ మహేష్‌నాయుడు తదితరులపై కేసు నమోదు
►సంఘటన స్థలాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి


సుండుపల్లి: సుండుపల్లిలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆనందరెడ్డి, ఎంపీపీ అజంతమ్మలకు చెందిన నిర్మాణంలో ఉన్న భవనాన్ని అధికారపార్టీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌ మహేష్‌ నాయుడు, శివారెడ్డిలు సోమవారం అర్ధరాత్రి సమయంలో కూల్చి వేశారు. సంఘటన స్థలాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఇంటికి సమీపంలో వేరెవరూ ఇల్లు నిర్మించుకోకూడదా అని ప్రశ్నించారు.

టీడీపీ నాయకులు ఇలాగే వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. సొంత భూమిలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఇల్లు కట్టుకుంటుంటే టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో మనుషులు, మారణాయుధాలతో వచ్చి జేసీబీతో ఇంటిని కూల్చి వేసి భయోత్పాతం సృష్టించడం దారుణమన్నారు.


వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి  మాట్లాడుతూ ఎంపీపీ, మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న వారి పూర్వీకుల స్థిరాస్తిలో ఇల్లు కట్టుకుంటుంటే దౌర్జన్యానికి పాల్పడటం తగదన్నారు. ఎంపీపీ అజంతమ్మ మాట్లాడుతూ తాము బెంగళూరులో ఉంటున్నామని,  తమ సొంత భూమిలో ఇంటి నిర్మాణం జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేశారన్నారు. తాము ప్రతి దాడికి దిగితే పరిస్థితి ఏమవుతుందన్నారు. ఏదైనా సమస్య ఉంటే మండల మేజిస్ట్రేట్‌ రావాలి. పోలీసులు రావాలి కానీ ఇలా టీడీపీ నాయకుడు మహేష్‌నాయుడు వచ్చి అతని ఇంటికి వెళ్లేందుకు దారి లేదంటూ తమ స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని కూల్చి వేయడం ఏమిటన్నారు.


పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికార పార్టీ నాయకులు కూల్చివేయడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీ అజంతమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, వైఎస్సార్‌సీపీ  నాయకులు, కార్యకర్తలు వెళ్లి సుండుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి సీఐ నరసింహరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సిరాజుదీ్దన్, సర్పంచ్‌ బ్రహ్మానందం, ఎంపీటీసీ బాబు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు జయరామిరెడ్డి, రంగారెడ్డి, రాజారెడ్డి, బెల్లం సంజీవరెడ్డి, గౌరవసలహాదారుడు కృష్ణంరాజు, ఎస్సీసెల్‌ మండల కన్వీనర్‌ చిన్నప్ప, మండల కోఆప్షన్‌ మెంబర్‌ పండూస్, బీసీ నాయకులు సూరి ఆచారి,  జిల్లా ఎస్టీ నాయకుడు చంద్రానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement