నేను టీడీపీ.. మా పార్టీ వాళ్లే.. కొంప ముంచారు | TDP Worker Karumanchi Surendra Fire On Own Party Leaders For Forcibly Grabbed His Properties, More Details | Sakshi
Sakshi News home page

నేను టీడీపీ.. మా పార్టీ వాళ్లే.. కొంప ముంచారు

Jan 31 2026 9:29 AM | Updated on Jan 31 2026 9:59 AM

TDP Worker Karumanchi Surendra Fire On own party Leaders

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ‘సొంత పార్టీ కార్యకర్తనే సర్వనాశనం చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కై నా ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు. ఎదురు తిరిగితే భార్యను, కుమార్తెల జీవితం నాశనం చేస్తామని బెదింరించారు. అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. వ్యాపారంలో నేను సంపాదించిన ఆస్తులన్నీ సొంత పార్టీ వాళ్లే లాక్కోవడంతో రోడ్డున పడ్డాను’ ఇది ప్రకాశం జిల్లా టంగుటూరు టీడీపీ కార్యకర్త కారుమంచి సురేంద్ర ఆవేదన. శుక్రవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయంపై  కారుమంచి సురేంద్ర భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను గత 25 ఏళ్లుగా అధికార టీడీపీకి చెందిన కామని విజయ కుమార్, కామని బాల మురళీ మోహన కృష్ణ, కామని రాజా రంగ భూపతిలకు చెందిన ‘ప్రగతి టొబాకో ట్రేడర్స్‌’ కంపెనీలో క్లర్క్‌గా, ఆ తర్వాత అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. 

కేవలం ఉద్యోగం మీద వచ్చే జీతం మీదే ఆధారపడకుండా కుటుంబాన్ని 2014లో ‘నవ్య సప్లయర్స్‌’ పేరుతో టెంట్‌ హౌస్, ‘నవ్యాస్‌ డిజే’  ‘ఎల్‌ఈడీ స్క్రీన్స్‌’ బిజినెస్‌ స్టార్ట్‌ చేశాను. నా మేనల్లుడు నలతోటి సుధీర్‌ ఈ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. 2022లో సింగరాయకొండలో ఒక రెస్టారెంట్‌ ప్రారంభించాను. ఆ తర్వాత రైతుల దగ్గర పొగాకు కొనుగోలు చేసి  ఇతర కంపెనీలకు అమ్మడం ప్రారంభించాను. అలా కిలో రూ. 180 చొప్పున 50 టన్నుల పొగాకు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీలో నిల్వ చేశాను. ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీకి ఎగుమతి ఆర్డర్‌ వచ్చింది. మార్కెట్‌లో పొగాకు కిలో రూ. 260కు చేరింది. దీంతో నేను పనిచేస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరైన బాల మురళీ మోహనకృష్ణ  నా వద్ద ఉన్న  పొగాకుపై కన్నేశారు. తక్కువ ధరకు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. 

అందుకు నేను అంగీకరించలేదు. కిలో రూ.260 ఉండగా కేవలం రూ.200ల ధరకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. మార్కెట్‌ రేటు ఇస్తే నా పొగాకు ఇచ్చేస్తానని చెప్పాను. తక్కువ కులం వాడివి మా దగ్గర తింటూ మాకే ఎదురు తిరుగుతావా? నీ బతుకు ఎంత? నీవు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాను. అంటూ బెదిరించాడని సురేంద్ర వాపోయాడు. ఆ తర్వాత కిలో రూ. 250లకు కొనుగోలు చేస్తానని, తనను ఒంగోలు రావాలని నమ్మబలికాడు. అందుకు అంగీకరించి గతేడాది ఆగస్టు 28న ఒంగోలు బయలు దేరిన తనను మార్గమధ్యంలో ట్రాఫిక్‌ సీఐ వై. పాండురంగారావుతో పాటు మరికొంత మంది పోలీసులు నన్ను అక్రమంగా ఎత్తుకెళ్లి నిర్బంధించారు. విపరీతంగా కొట్టి బెదిరించారు. హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్న నా పెద్ద కూతురుని నాశనం చేస్తామన్నారు. నా భార్యను, నా ఇద్దరు ఆడపిల్లలను నీచంగా దూషించారు.

గన్‌తో బెదిరించి ఆస్తి పత్రాలపై, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. ఎస్పీ ఏఆర్‌. దామోదర్, డీఎస్పీ రాయపాటి సాంబశివరావుల ఆదేశాలతో సీఐలు హజరత్తయ్య, పాండురంగారావు, ఎస్‌ఐలు నాగమల్లేశ్వరరావు, కమలాకరరావు మా ఇంటిపై దాడి చేసి రూ.40 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారు. అక్కడ నుంచి  ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆ సొమ్ము మొత్తాన్ని ఎస్పీ దామోదర్, డీఎస్సీ సాంబశివరావులు..  బాల మురళీ మోహన కృష్ణకు అప్పగించారు. నన్ను, నా భార్య కమల, నా మేనల్లుడు సు«దీర్‌ ను మరోసారి అక్రమ కస్టడీలోకి తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. కంపెనీ యజమానులు కామని విజయ కుమార్, బాల మురళీ మోహన కృష్ణ,  రాజా రంగ భూపతి ముగ్గురు  టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్, పోలీసుల సహకారంతో నేను కష్టపడి సంపాదించిన ఆస్తినంతా తమ పేర్ల మీద బలవంతంగా రాయించుకుని తనను రోడ్డుపై పడేశారని మొరపెట్టుకున్నాడు. 

50 టన్నుల పొగాకు, ఫ్లాట్లు, కార్లు, అన్నీ తమ పేర్లపై మార్చుకుని.. తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, తన కుటుంబాన్ని సర్వ నాశనం చేశారని వాపోయాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబుకు లేఖరాశానని, కానీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. 2024లో పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పనిచేశా. సొంత పార్టీ నాయకులే నన్ను సర్వనాశనం చేశారు. నాకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు, లోకే‹Ù, పవన్‌ కళ్యాణ్‌ స్పందించాలి. నన్ను ఇబ్బందులకు గురిచేసిన కంపెనీ యజమానులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కారుమంచి సురేంద్ర వేడుకున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement