Sakshi News home page

రాజధానిలో రౌడీల దందా

Published Wed, Dec 30 2015 7:15 PM

రాజధానిలో రౌడీల దందా - Sakshi

బెంబేలెత్తుతున్న బిల్డర్లు, వ్యాపారులు
ముఠాగా ఏర్పడిన షీటర్లు
వాటాలివ్వాలని బెదిరింపులు

 
రాజధాని ప్రాంతంలో రౌడీషీటర్ల దందా కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు రౌడీషీటర్లు ముఠాగా ఏర్పడి గుంటూరు నగరాన్ని అడ్డాగా ఏర్పాటుచేసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారు. వీరికి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండగా ఉన్నారని సమాచారం. నూతన వెంచర్లు ఏర్పాటుచేసే రియల్టర్లు, బిల్డర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని తెలిసింది. దందాలతో సంపాదించిన డబ్బుతో రౌడీషీటర్లు సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోతున్నారు. ఈ వ్యవహారాల గురించి పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం లేకపోవడంతో చర్యలు తీసుకునే విషయంలో మిన్నకుండిపోతున్నారు.

 
గుంటూరు రూరల్ :  గుంటూరు నగరంలోని కొరిటెపాడు ప్రాంతానికి చెందిన ఓ మాజీ రౌడీ షీటర్, వినుకొండకు చెందిన మరో రౌడీ షీటర్, స్థానికంగా ఉంటున్న కొందరు కలిసి కొరిటెపాడు, నగరాలు అడ్డాగా చేసుకున్నారు. ఐదుగురు రౌడీషీటర్ల ముఠా దందాలకు పాల్పడుతూ కొత్తగా వస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లను బెంబేలెత్తిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. 

నగర శివారుల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లు, నూతన అపార్ట్ మెంట్లపై కన్నెశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నూతనంగా అపార్ట్ మెంట్‌లు, వెంచర్లు నిర్మించే వారిని టార్గెట్ చేసుకున్నారు. తొలుత వారితో మంచి సంబంధాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. తాము పెద్ద వ్యాపారులమని మార్కెట్లో నమ్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లు, ప్లాట్లు విక్రయించి పెడతామని చెప్పి రియల్ వ్యాపారులకు చెందిన అన్ని విషయాలు తెలుసుకుంటారు.
 
నకిలీ పత్రాలతో మోసం...
 ఎవరైనా ఈ ముఠాకు భయపడకుండా ఎదురు తిరిగితే ఆ వెంచర్,  అపార్ట్‌మెంట్ ప్రాబ్లం ఉందని, లీగల్ ఇబ్బందులు ఉన్నాయని కొనుగోలుదార్లకు చెప్పి వ్యాపారం సాగనివ్వకుండా అడ్డుపడుతుంటారు. రాయలసీమకు చెందిన కొత్తగా కొందరు రౌడీషీటర్లను పిలిపించి ఆయా కాంట్రాక్టర్లకు ఫోన్‌లు చేయించి బెదింరింపులకు పాల్పడుతున్నారని సమాచారం.

ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిస్తే వెంటనే ఆయా ప్లాట్ల పేరుతో నకిలీ సంతకాలతో పత్రాలు సృష్టిస్తారు. వెంచర్, ప్లాటు నిర్వహణదారుడు అదే ప్లాటును తమకు విక్రయించాడని చెప్పి అవతలి వారిని బెదిరింపులకు గురిచేస్తుంటారు. దీంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తారు. ఈ విధంగా వ్యాపారాన్ని సాగనీయరు. ఈ రౌడీ ముఠాకు తలొగ్గి దిక్కుతోచని పరిస్థితుల్లో రియల్టర్లు వాటాలు ఇచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని సమాచారం.
 
ప్రాణభయం కలిగిస్తున్న వైనం
 తెలిసినవారికి తమవే ప్లాట్లు అని చెప్పి విక్రయిస్తారు. ప్లాట్లు విక్రయించిన వారికి వెంచర్ యజమానులు మామూలుగా అయితే కమీషన్ ఇస్తారు. కానీ వీరి రూటే సపరేటు అన్నట్లుగా రౌడీషీటర్లు వాటా ఇవ్వాలని అడుగుతారు. లేకుంటే ప్రస్తుతానికి ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్న మరో రౌడీషీటరు పేరు చెప్పి అన్న తాలూకా మనుషులమని బెదిరిస్తారు. వాటాలు ఇవ్వకుంటే అంతే సంగతులు అన్నట్లు ప్రాణభయాన్ని కలిగిస్తారు. చేసేదిలేక కొత్తగా వచ్చిన వ్యాపారులు వారికి వచ్చిన దాంట్లో వాటా ఇస్తూ మెల్లగా వ్యాపారం ముగియగానే మరో ప్లాట్లు వేయకుండా జారుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement