ఢీకొన్న వాహనంపైనే ఎగిరిపడ్డారు!
మండలంలోని శ్రీహరిపురం వద్ద అలికాం బత్తిలి రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన వాహన ప్రమాదంలో
	వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు
	  రిమ్స్‌కు తరలింపు
	 
	 ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం వద్ద అలికాం బత్తిలి రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన  వాహన ప్రమాదంలో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధి కృష్ణాపురం సమీప సీపానోడిపేటకు చెందిన గురుగుబెల్లి సంధ్య, అన్నెపు శ్రావణి అనే విద్యార్థినులు ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో సైకిల్‌పై శ్రీహరిపురంలో ఉన్న తమ బంధువులు ఇంటికి బయలుదేరారు. అదేమార్గంలో ఎదురుగా సరుబుజ్జలి మండలం కూనజమ్మవాని పేట నుంచి నూతన వధూవరులతో ప్రయాణిస్తున్న టాటా సుమో కారు వీరిని ఢీకొట్టింది.
	 
	  బాలికలిద్దరూ ఎగిరి వాహనం ముందుభాగంలో ఉన్న అద్దంపైకి పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలోని నూతన వధూవరులు, వారి బంధువులు  స్థానికులు 108కు సమాచారం అందించినా ఆమదాలవలసలో లేదని, బూర్జవాహనానికి సమాచారం అందించారు. బూర్జవాహనం కూడా దూర ప్రాంతంలో ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ అంబులెన్సుకు సమాచారం అందిచారు.
	 
	 ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు మూడు 108 వాహనాలు ఒకేసారి సంఘటన స్థలానికి చేరుకోగా, అప్పటికే క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో రిమ్స్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన వివరాలను బట్టి తాము కూడా కేసు నమోదు చేస్తామని ఆమదాలవలస పోలీసులు తెలిపారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
