కొడకండ్ల మండలంలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల బాగోతం కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక రెవెన్యూ సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ ఊచ్చు ఎవరికి బిగుస్తుందోననే వారు ఆందోళనకు గురవుతున్నారు.
రెవెన్యూ సిబ్బందిలో నకిలీ పుస్తకాల గుబులు
Aug 24 2016 12:49 AM | Updated on Sep 4 2017 10:33 AM
కొడకండ్ల : మండలంలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల బాగోతం కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన నేపథ్యంలో స్థానిక రెవెన్యూ సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ ఊచ్చు ఎవరికి బిగుస్తుందోననే వారు ఆందోళనకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా ఓ ముఠా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను తయారు చేస్తూ అమాయక రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పా ల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నకిలీ పుస్తకాలు తయారు చేసిన ముఠా సభ్యులు స్థానిక రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి వాటి భూముల సర్వే నంబర్లను కంప్యూటర్ పహాణీలు, 1 బీలో నమోదు చేయించి పలువురు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. అటెండర్ నుంచి మొదలుకుని పైస్థాయి అధికారి వరకు అందరికి ముడుపులిచ్చి తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించినట్లు సమాచారం. అయితే వందల సంఖ్యలో నకిలీ పాసుపుస్తకాలను తయారు చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని రైతు లు అభిప్రాయపడుతున్నారు. కాగా, నకిలీ పాసు పుస్తకాల బాగోతం వెలుగులోకి రావడంతోపాటు పోలీసులు దానిపై విచారణ చేపడుతుండడంతో అనుమానిత వ్యక్తులు ఐదారు రోజులుగా మండల కేంద్రంలో కనిపించడంలేదని తెలుస్తోంది. ఇదిలా ఉం డగా, ఈ తతంగం వెలుగులోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సిబ్బందిలోని ఇద్దరిని ఇంచార్జ్ తహసీల్దార్ సరెండర్ చేయడంతోపాటు కొంతమంది వీఆర్‌ఏలను కార్యాలయానికి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం.
Advertisement
Advertisement