
నాలుగేళ్లలో రెట్టింపు
మార్చి చివరికి రూ.35.4 లక్షల కోట్లు
కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగానికి (రియల్టి) బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. ఈ రంగానికి బ్యాంకుల రుణ వితరణ నాలుగేళ్లలో రెట్టింపై 2025 మార్చి నాటికి మొత్తం రూ.35.4 లక్షల కోట్లకు చేరింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ అయిన కొలియర్స్ ఇండియా ప్రకటించింది. ఈ రంగానికి చెందిన టాప్–50 లిస్టెడ్ కంపెనీల లాభం, మార్కెట్ పనితీరును విశ్లేషించినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది.
‘‘కరోనా విపత్తు అనంతరం రియల్ ఎస్టేట్ రంగం ఆర్థిక పనితీరు ఎంతో మెరుగుపడింది. ఇతర రంగాల కంటే మెరుగైన పనితీరు చూపించింది. దీంతో ఈ రంగానికి రుణ వితరణలో మంచి పురోగతి నెలకొంది. బ్యాంకుల స్థూల రుణాలు 2021 మార్చి నాటికి రూ.109.5 లక్షల కోట్లు కాగా, 2025 మార్చి నాటికి రూ.182.4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి బ్యాంకుల రుణ వితణ రెట్టింపైంది. రూ.17.8 లక్షల కోట్ల నుంచి రూ.35.4 లక్షల కోట్లకు పెరిగింది’’అని ఆర్‌బీఐ డేటా ఆధారంగా కొలియర్స్ ఇండియా తెలిపింది.
పెరిగిన విశ్వాసం
బ్యాంకుల రుణ వితరణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం వాటా 20 శాతానికి చేరిందని.. ఈ రంగం పట్ల బ్యాంకుల్లో విశ్వాసం పెరుగుదలను ఇది సూచిస్తున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. ‘‘ఎన్నో అస్థిరతలు నెలకొన్న తరుణంలోనూ భారత రియల్ ఎస్టేట్ రంగం బలంగా నిలబడడమే కాకుండా, ద్రవ్యపరమైన క్రమశిక్షణను చూపించింది’’అని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాజి్ఞక్ తెలిపారు.
ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలతో పోల్చి చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో రియల్‌ఎస్టేట్ రంగంలోనే క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్‌లు (రేటింగ్ పెంపు) ఎక్కువగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. నివాస భవనాలు, వాణిజ్యం, పారిశ్రామిక భవంతులు, గోదాములు, రిటైల్, ఆతిథ్యం వసతుల పరంగా డిమాండ్–సరఫరా మెరుగ్గా ఉండడం రియల్ ఎస్టేట్ రంగ రుణ నాణ్యత పటిష్టంగా ఉండేందుకు మద్దతునిస్తున్నట్టు వివరించింది. టాప్–50 కంపెనీలు లాభదాయకత, నగదు ప్రవాహం, బ్యాలన్స్ షీటు పరంగా గత ఐదేళ్లలో పనితీరు గణనీయంగా మెరుగైనట్టు పేర్కొంది. టాప్–50లో 62 శాతం కంపెనీల లాభాల మార్జిన్ 2024–25లో గరిష్టానికి చేరినట్టు వివరించింది.