
2025–26పై క్రిసిల్ రేటింగ్స్ అంచనా
బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలల కాలంలో (అక్టోబర్ నుంచి) రుణ వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని తెలిపింది. కార్పొరేట్ రుణాలు నిదానిస్తాయంటూ.. రిటైల్ రుణాలు వృద్ధిని నడిపించనున్నట్టు వెల్లడించింది. డిపాజిట్లలో గృహాల వాటా తగ్గుతుండడం ఆందోళనకరమంటూ, డిపాజిట్లలో స్థిరత్వం సమస్యలకు దారితీయొచ్చని పేర్కొంది.
‘2025–26 క్యూ1లో (ఏప్రిల్–జూన్) రుణ వృద్ధి 9.5 శాతానికి నిదానించింది. ఆ తర్వాత 10 శాతానికి పెరిగింది. ద్వితీయ ఆరు నెలల్లో రుణాల్లో వృద్ధి వేగవంతమై పూర్తి ఆర్థిక సంవత్సరానికి 11–12 శాతానికి చేరుకోవచ్చు’ అని క్రిసిల్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు ఇందుకు అనుకూలిస్తాయన్నారు. ఆర్‌బీఐ రెపో రేట్ల తగ్గింపు ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై ఇంకా పూర్తిగా ప్రతిఫలించాల్సి ఉందన్నారు. బ్యాంకు రుణ రేట్లు తగ్గుముఖం పడితే అప్పుడు డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేశారు. ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు.
డిపాజిట్లు కీలకం..
బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా ఐదేళ్ల క్రితం 64 శాతంగా ఉంటే, అది 60 శాతానికి తగ్గడం పట్ల క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరమైన రుణ వృద్ధికి డిపాజిట్లు కీలకమని పేర్కొంది. వ్యవస్థలో లిక్విడిటీ పెంచే దిశగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో (సీఆర్‌ఆర్ తగ్గింపు, లిక్విడిటీ కవరేజీ నిబంధనలు) డిపాజిట్లలో వృద్ధి తగినంత ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2026 మార్చి నాటికి 2.3–2.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి: త్వరలో ఈ-ఆధార్ యాప్ ప్రారంభం