
ఫలితంగా జూన్ క్వార్టర్‌లో 7.8 శాతం వృద్ధి
క్రిసిల్ ఆర్థికవేత్తల బృందం
దేశీ డిమాండ్ పుంజుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకునేలా చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నామినల్ జీడీపీ మాత్రం జూన్ క్వార్టర్‌లో 8.8 శాతానికి తగ్గిందని, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 10.8 శాతంగా ఉన్నట్టు క్రిసిల్ ఆర్థికవేత్తల బృందం పేర్కొంది.
‘దేశీ ప్రైవేటు వినియోగం బలపడింది. ఇది తయారీ, సేవల రంగానికి ఊతమిచ్చింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం మూలధన వ్యయాలను పెద్ద మొత్తంలో పెంచిది. ఇది సైతం ప్రభుత్వ వినియోగ వ్యయాన్ని పెంచింది’ అని క్రిసిల్ ఆర్థిక బృందం తెలిపింది. స్థూల విలువ జోడింపు (జీవీఏ) క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఉన్న 6.8 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ ప్రైవేటు వినియోగం పెరిగేందుకు దోహదం చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది.
సవాళ్లలోనూ పటిష్ట పనితీరు..
అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత జీడీపీ రికార్డు స్థాయిలో 7.8 శాతంగా నమోదు కావడం ప్రశంసనీయమని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. గత ఐదు త్రైమాసికాల్లోనే ఇది గరిష్ట రేటు అని గుర్తు చేశారు. వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో అన్ని రంగాల్లో అవకాశాల విస్తరణకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో తన నిర్వహణలోని అన్ని వ్యాపారాల విస్తరణకు, విలువ జోడింపునకు ఐటీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..