ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి
ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సామాజిక హక్కుల వేదిక నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
– అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
– చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
– రాజ్యాధికారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం
– సామాజిక హక్కుల వేదిక మహాధర్నా
కర్నూలు(న్యూసిటీ): ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని సామాజిక హక్కుల వేదిక నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ సమస్యల పరిష్కారానికి..శనివారం కలెక్టరేట్ పక్కన సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషఫణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. సంపద అంతా కొంతమంది దగ్గర ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిమ్నవర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తే పేద ప్రజల సమస్యలకు న్యాయం జరుగుతుందని వివరించారు. రాజ్యాధికారం కోసం సామాజిక హక్కుల వేదిక నాయకులందరూ పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.
హామీల అమలేది బాబూ..
మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవడానికి పాతనగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని గఫూర్, రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గతంలో ఆగస్టు 15వ తేదీన కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.3,400 కోట్లు అప్పుగా తీసుకుని అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించి 13 జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి మార్చే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి టీడీపీలోకి మారి కోట్లాది రూపాయలను తీసుకున్నారని విమర్శించారు.
ఐక్యపోరాటాలే శరణ్యం..
ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన సాధ్యమని సీపీఐ ఎంఎల్‌సీ పి.జె.చంద్రశేఖర్‌రావు అన్నారు. బీసీలకు సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు విమర్శించారు. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ రావడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్, జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.భీమలింగప్ప, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం, జిల్లా కార్యదర్శి మునెప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు, సామాజిక హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాష్ చంద్రబోస్, బుడగజంగం యువజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు టి.మనోహర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.