అసైన్డ్‌పై గద్దలు! | Regulations that are contrary to the terms | Sakshi
Sakshi News home page

అసైన్డ్‌పై గద్దలు!

Jun 17 2017 12:42 AM | Updated on Mar 28 2018 11:26 AM

అసైన్డ్‌పై గద్దలు! - Sakshi

అసైన్డ్‌పై గద్దలు!

ఇటీవల శంషాబాద్‌ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్‌ మండలం...

పరాధీనమవుతున్న వందల ఎకరాల అసైన్డ్‌ భూమి
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లు
అధికారుల అండతో రెచ్చిపోతున్న బడాబాబులు
చేతులు మారుతున్నా పట్టించుకోని యంత్రాంగం
ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలదే కీలకపాత్ర..!
కేవలం నోటీసులతోనే సరిపుచ్చుతున్న ప్రభుత్వం
విలువైన భూములను కాపాడుకోవడంపై నిర్లక్ష్యం


ఇటీవల శంషాబాద్‌ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌ మొదలు అనేక చోట్ల అసైన్డ్‌ భూములు చేతులు మారినట్లు తేలింది. ఈ క్రమంలోనే రోజుకోతీరుగా మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,15,218 మంది భూమిలేని నిరుపేదలకు 1,58,646.25 ఎకరాల మేర భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. దీనిని కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ చేతులు మారినా.. ఇతరత్రా అవసరాలకు మార్పు చేసినా పీఓటీ చట్టం కింద అసైన్‌మెంట్‌ను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికుంది.

ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు చెల్లవని తెలిసినా యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. నగరీ కరణతో భూముల విలువలు నింగినంటాయి. దీంతో అసైన్డ్‌ భూములు కూడా పరాధీనమవుతున్నాయి. అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అక్రమార్కులు ఎగురేసుకుపోతున్నా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పీఓటీ చట్టం–1977 కింద వెనక్కి తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటోంది. అసైనీల స్థానే బినామీలు పుట్టుకొస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. 

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూముల ధరలు పెరిగిపోవడంతో అసైన్డ్‌ భూములపై కన్నేసిన బడాబాబులు, ప్రజాప్రతినిధులు పేద రైతులను నయానో భయానో ఒప్పించి వాటిల్లో పాగా వేస్తున్నారు. కారుచౌకగా లభించే ఈ భూములను కొందరు ఫామ్‌హౌస్‌లుగా మార్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం విద్యాసంస్థలు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ప్లాట్లు చేసి విక్రయించేస్తున్నారు. ఈ తతంగమంతా బహిరంగంగానే జరుగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగానికి మాత్రం కనిపించదు. ప్రభుత్వ పెద్దలు సైతం ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తుండడంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించదు.

అక్రమ రిజిస్ట్రేషన్లు!
ప్రభుత్వ భూములుగా పరిగణించే వీటిని 22ఏ కింద నిషేధిత జాబితాలో పొందుపరిచింది. ఈ భూముల క్రయ విక్రయాలు జరుగకుండా నిరోధిస్తూ ఈ జాబితాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు పంపింది. అయినప్పటికీ గుట్టుగా భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ భూములు ఏకంగా రిజిస్ట్రేషన్‌ కూడా అవుతున్నాయి. రియల్టర్లు, బడాబాబులతో మిలాఖత్‌ అయిన కొందరు సబ్‌రిజిస్ట్రార్లు వీటిని కూడా రిజిస్ట్రేషన్‌ చేస్తుండడం గమనార్హం. ఇటీవల శంషాబాద్‌ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌ మొదలు అనేక చోట్ల అసైన్డ్‌ భూములు చేతులు మారినట్లు తేలింది. కోర్టు కేసులను సాకుగా చూపి విలువైన ఈ భూములను ఎగురేసుకుపోతుండడంతో రెవెన్యూయంత్రాంగం చేష్టలుడిగిచూస్తోంది.

జిల్లా అధికారుల లెక్కల ప్రకారం గతేడాది వరకు పరాధీనమైన 3,553 ఎకరాలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆయా భూముల్లో బోర్డులు నాటినప్పటికీ, చాలా చోట్ల పొజిషన్‌లో మాత్రం ఆక్రమణదారులే కొనసాగుతుండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో పేదలు భూములు అమ్ముకోవడం.. అమాయక రైతులు కొని మోసపోగా.. శివార్లలో మాత్రం పలుకుబడి గల సంపన్నవర్గాలు ఈ భూముల్లో తిష్ట వేశాయి. ముఖ్యంగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, బాలాపూర్, కందుకూరు మండలాల్లో అసైన్డ్‌ భూములు పెద్దల గుప్పిట్లోకి వెళ్లాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. దీనికితోడు న్యాయపరమైన వివాదాలు కూడా అడ్డువస్తుండడం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం కష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement