చిరుజల్లులు ఎస్సై సామర్థ్య పరీక్షకు అడ్డంకిగా నిలిచాయి.
కరీంనగర్: చిరుజల్లులు ఎస్సై సామర్థ్య పరీక్షకు అడ్డంకిగా నిలిచాయి. ఎడతెరపి లేకుండా వర్షం పడడంతో మంగళవారం నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా పడింది. జిల్లా కేంద్రంలో ఉదయం నుంచి వర్షం కురవడంతో రన్నింగ్ ట్రాక్ మొత్తం బురదమయంగా మారింది. మంగళవారం ఉదయం గంటపాటు సోమవారం మిగిలిపోయిన 20 మంది అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు.
ట్రాక్ ఇబ్బందిగా మారడంతో మంగళవారం పరీక్షలు నిర్వహించాల్సిన వారికి వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు. నేడు నిర్వహించాల్సిన అభ్యర్థులకు యథావిధిగా సామర్థ్యం పరీక్షలుంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఒకవేళ వర్షం సహకరించకపోతే వాయిదా వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం వర్షంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఇబ్బందులుపడ్డారు. అధికారులు వాయిదా విషయంపై సకాలంలో ప్రకటించకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు.