పకడ్బందీగా పరీక్షలు

పకడ్బందీగా పరీక్షలు - Sakshi


- ఈ-మెయిల్‌లో ప్రశ్నపత్రాలు

-ఎస్కేయూ యూజీ, పీజీ , దూరవిద్య విభాగాల్లో అమలు


ఎస్కేయూ : ఎస్కేయూ దూరవిద్యలో ఈ- మెయిల్‌ ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షల నిర్వహణకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు అవకాశంలేకుండా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే జేఎన్‌టీయూ అనంతపురంలో  ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు పంపే విధానం  విజయవంతం అయింది.  ఎస్కేయూ యూజీ, పీజీ, దూరవిద్య పరీక్షల్లో నూతన విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలో దూరవిద్య,  యూజీ, పీజీ సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపనున్నారు.



రెండు రాష్ట్రాల్లో అమలు..

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో   205 అధ్యయన కేంద్రాల ద్వారా  విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు.  మొత్తం 90 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.   పరీక్ష కేంద్రాల వద్దకు సిబ్బందే  ప్రశ్నాపత్రాలను చేరవేయాల్సిన  అనివార్య పరిస్థితి. దీనికి తోడు అధిక వ్యయంతో పాటు , సిబ్బంది పది రోజుల ముందే ఈ విధుల్లో తలమునకలయ్యేవారు.  మూడేళ్ల కిందట దూరవిద్య ప్రశ్నాపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరకముందే ముందే ప్రశ్నాపత్రాలు వెల్లడయ్యాయి. ఇలాంటి వ్యవహారాలకు చెక్‌ పేట్టేందుకు   ఈ మెయిల్‌ విధానానికి శ్రీకారం చుడుతున్నారు.



అరగంట ముందు ఈ– మెయిల్‌ :

                 పరీక్షలు ప్రారంభానికి నిర్ధేశించిన సమయం కంటే అరగంట ముందు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆ రోజు సబ్జెక్టుకు సంబంధించి ఈ –మెయిల్‌ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపుతారు.   రహస్య ప్రదేశంలో వీటిని వెంటనే జిరాక్స్‌ చేసుకోవాలి. ఇందుకు ప్రతి ప్రిన్సిపల్‌ కార్యాలయంలో అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి. దీనిపై ప్రిన్సిపాళ్లకు ముందస్తు శిక్షణ ఇచ్చారు.   ఎస్కేయూ అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలలు, దూరవిద్య అధ్యయన కేంద్రాలకు సంబంధించిన ప్రిన్సిపాళ్లకు అధికార మెయిల్స్‌కు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు క్రోడీకరించారు. ప్రశ్నాపత్రాలు రహస్యంగా ఉంచడం, పరీక్షలు నిర్వహణ పకడ్భందీగా నిర్వహించే బాధ్యత ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top