పెండింగ్ ఫైల్స్‌పై స్పెషల్ డ్రైవ్ | prakasam district joint collector special drive over pending files | Sakshi
Sakshi News home page

పెండింగ్ ఫైల్స్‌పై స్పెషల్ డ్రైవ్

May 31 2016 9:54 AM | Updated on Sep 4 2017 1:21 AM

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడించారు.

ప్రతి ఉద్యోగి ఐదు ఫైళ్లు పరిష్కరించాలి
జూన్‌లోపు గత ఏడాది ఫైళ్లు పరిష్కారం కావాలి
అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్


ఒంగోలు: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను  పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో పెండింగ్ ఫైళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌లో చాలాకాలంగా 12 వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. పెండింగ్ ఫైళ్లను శాఖల వారీగా, సంవత్సరాల వారీగా విభజించారన్నారు. కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్లకు చెందిన ప్రతి ఉద్యోగి కనీసం ఐదు ఫైళ్లు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన ఫైళ్లను ఈ ఏడాది జూన్‌లో పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో మీకోసంలో వచ్చిన అర్జీలను ఏవిధంగా పరిష్కరించినా ఒకే ఆప్షన్ ఉండటంతో విజయవంతంగా పరిష్కరించినట్లు సంబంధిత అర్జీదారునికి సమాచారం వెళ్లేదన్నారు.

ఇప్పటి వరకు మీకోసం ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో 7,198 అర్జీలు గడువు దాటినవి ఉన్నాయని, డీవో లేఖ ద్వారా పరిష్కరించమని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. పరిశ్రమల శాఖకు సంబంధించి 1308 అర్జీలు, గనుల శాఖకు 979, రెవెన్యూ శాఖకు  890 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం మీకోసంకు సంబంధించి ఉన్నత స్థాయి ప్రతినిధులతో మాట్లాడి దాని సాఫ్ట్‌వేర్‌ను మార్పించినట్లు తెలిపారు. ఇకపై ఎవరు అర్జీ అయినా పరిష్కరించారా, పెండింగ్‌లో ఉందా, తిరస్కరించారా, ఎవరికి పంపారనే విషయమై స్పష్టమైన సమాచారం సంబంధిత అర్జీదారునికి పంపిస్తామని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 ఐ.ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement