నిఘా పటిష్టం | powerful control of protection | Sakshi
Sakshi News home page

నిఘా పటిష్టం

Aug 12 2017 9:55 PM | Updated on Sep 11 2017 11:55 PM

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘాను పటిష్టం చేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం..
ఫ్యాక‌్షన్, గ్రూపు తగాదాల అడ్డుకట్టపై దృష్టి

– చిన్న సమస్యనైనా తీవ్రంగా పరిగణించాలి
- జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు ఉండరాదు
- ఇసుక జిల్లా సరిహద్దు దాటి పోరాదు
– నేర సమీక్షలో ఎస్పీ అశోక్‌కుమార్‌ ఆదేశం


అనంతపురం సెంట్రల్‌: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘాను పటిష్టం చేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో సవాళ్లతో కూడుకుని పని చేయాల్సి ఉన్నందున ఫ్యాక‌్షన్‌, గ్రూపు తగాదాలపై దృష్టి సారించాలని, చిన్న సమస్య తలెత్తినా తీవ్రంగా పరిగణించి మొగ్గలోనే తుంచేయాలని సూచించారు. శనివారం నగరంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌హాల్లో నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గతంలో జరిగిన హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు తదితర ఘటనలపై ఆరా తీశారు. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంతంగా ఉండేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు.

జిలాల్లో అతి సున్నితమైన (హైపర్‌ సెన్సిటివ్), సున్నితమైన (సెన్సిటివ్‌) గ్రామాల్లో పోలీసుపరంగా చట్టాన్ని అనుసరిస్తూ కఠినంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో ఏం జరుగుతోందనే సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫ్యాక‌్షనిస్టులు, రౌడీల కదలికలపై నిత్యం నిఘా ఉంచాల్సిందేనని సూచించారు. పక్కాగా బైండోవర్లు చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో సంబంధిత సీఐలు, డీఎస్పీలు ఆయా గ్రామాలను సందర్శించి పరిస్థితులను బేరీజు వేసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫ్యాక‌్షన్, దాని పర్యవసానాల గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ చేపట్టి ప్రజల్లో స్పూర్తి నింపాలన్నారు. జిల్లాలో ఎక్కడా బెల్టుషాపులు కొనసాగరాదని, ఇసుక జిల్లా దాటకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు.

త్వరలో జరిగే గణేష్‌ వేడుకలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేయాలన్నారు. హిందూపురం, కదిరి పట్టణాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు స్నేహపూర్వకంగా మెలిగేలా శాంతి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌ ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ పక్కాగా చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహన చోదకులపై చర్యలు తీసుకోవాలన్నారు. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, టెక్నాలజీని వినియోగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, శివరామిరెడ్డి, వెంకటరమణ, కరీముల్లాషరీఫ్, చిదానందరెడ్డి, శ్రీధర్‌రావు, వెంకటరమణ, ఖాసీంసాబ్, నర్సింగప్ప, మహబూబ్‌బాషా, నాగసుబ్బన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement