ధనిక రాష్ట్రమైన తెలం గాణను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, జన ఆవేదన సభ నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
అమీర్‌పేట: ధనిక రాష్ట్రమైన తెలం గాణను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, జన ఆవేదన సభ నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మర్రి శశిధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘జన ఆవేదన’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే దేశం ,రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశానికి ఒరిగిందేమి లేదని, పైగా ఉగ్రవాదం, అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి ప్రతి మహిళ అకౌంట్‌లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానన్న హమీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక సీఎం కేసీఆర్ మతిస్థిమితం లేని విధంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మంత్రివర్గంలో ఉన్న 32 మంది మంత్రులపై అవినీతి అరోపణలు వస్తే విచారణ జరిపించలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. నయీం కేసుల్లో పట్టుపడ్డ ధనం ఎక్కడ దాచిపెట్టారో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో జన ఆవేదన సభలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మె ల్యే మర్రి శశిధర్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ మాట్లాడారు.