దోమ కాటు.. కాలుష్యం పోటు

pollution in medchal district - Sakshi

గ్రామాల్లో కానరాని అభివృద్ధి పనులు

అధ్వానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ దుస్థితిలో రోడ్లు

ఆదాయం ఉన్నా.. అభివృద్ధి శూన్యం

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ..అధ్వానంగా పారిశుద్ధ్యం..కాలుష్యం..దోమకాటులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల పాలతున్నారు.. ఇదీ గ్రామాల్లో దుస్థితి. అధికారులు పన్నులు వసూలుపై చూపిస్తున్న శ్రద్ధ అధిభివృద్ధి పనులపై చూపించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల పరిధిలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాద్‌ మహానగరానికి కూత వేటు దూరంలో ఉన్న పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం , దోమలు, ఈగలు, కాలుష్యం,దుర్వాసన వంటి సమస్యల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో శానిటేషన్, వాటర్‌ వర్స్, డంపింగ్‌ యార్డులు, డస్ట్‌ బిన్లు, డ్రైనేజీలు, కల్వర్టులు , కమ్యూనిటీ హాళ్లు, అంతర్గత రోడ్లు, శశ్మాన వాటికలు వంటి, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటుకెక్కుతున్నాయి. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డుతో జవహర్‌నగర్, చీర్యాల, నాగారం, బండ్లగూడ, అహ్మద్‌గూడ, దమ్మాయిగూడెం గ్రామాలకు కాలుష్య సమస్య పొంచి ఉంది. ఈ డంపింగ్‌ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనకు తోడు నీరు కూడా కాలుష్యంగా మారుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షా కాలంలో ప్రజల కష్టాలు వర్ణణాతీతం.

ఆదాయం ఎక్కువే..
జిల్లాలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 12 గ్రామ పంచాయతీలు మినహాయించి మిగతా గ్రామాలన్నీ మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. గ్రామాల ప్రజల నుంచి ముక్కు పిండి ఏడాదికి వివిధ పన్నుల పేరుతో రూ.100 కోట్లు పంచాయతీ శాఖ వసూలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.91 కోట్లు పన్నులు వసూలు చేసిన జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు పెంచడం ద్వారా రూ.100 కోట్లు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వివిధ పన్నుల ద్వారా రూ.62 కోట్లు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు మార్చి కల్లా మిగతా రూ.38 కోట్ల పన్నులు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద రెండు పర్యాయాలు 77 గ్రామ పంచాయతీలకు రూ.15.30 కోట్ల నిధులు విడుదల చేసింది. అయినప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీలకు సమకూరే ఆదాయంలో 30 శాతం సిబ్బంది జీతభత్యాలకు, 15 శాతం పారిశుద్ధ్య పనులకు, 15 శాతం విద్యుత్‌ దీపాలు, 15 శాతం నీటి సరఫరా, 20 శాతం నిధులు గ్రామంలో అభివృద్ధి పనులకు, 5 శాతం నిధులు ఇతర ఖర్చులకు (స్టేషనరీ తదితర వాటికి) వినియోగించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top