జూట్ కారిడార్‌కు అనుమతి
కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరైనట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు.
- జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరు
- మొదట కోడుమూరు.. తర్వాత ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు
- జాతీయ జనపనార బోర్డు కార్యదర్శితో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరైనట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. రాయలసీమ పరిధిలో కర్నూలు నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇక్కడి ప్రజల ఉపాధి కోసం జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రాల ఏర్పాటు కోసం ఈనెల 5వ తేదీన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ జనపనార బోర్డుకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు నేషనల్ జ్యూట్ బోర్డు (జాతీయ జనపనార బోర్డు) సానుకూలంగా స్పందించిందన్నారు. బోర్డు కార్యదర్శి, డైరెక్టర్ అరవింద్‌కుమార్ సోమవారం కర్నూలుకు వచ్చి ఎంపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలోగా కోడుమూరులో 25 మందికి మొదటి శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో కలకత్తా, హైదరాబాదుకు సంబంధించిన జ్యూట్‌బోర్డు సాంకేతిక అధికారులు నరసింహులు (ఎన్‌జేబీ ఎంపీఓ), ధనుంజయ్ (ఎన్‌జేబీ టీఏ) తదితరులు పాల్గొన్నారు.