వెలుగుచూస్తున్న పింఛన్ల అక్రమాలు

వెలుగుచూస్తున్న పింఛన్ల అక్రమాలు

కాపు కులస్తులకు చేనేత ..

సొసైటీ డైరెక్టర్‌కు వింతంతు పింఛన్లు

గొల్లప్రోలు (పిఠాపురం) : మొన్న పిఠాపురం.. నిన్న అనపర్తి నియోజకవర్గం కొంకుదురు...నేడు గొల్లప్రోలు నగర పంచాయతీలో పింఛను అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పచ్చనేతలు కనుసన్నల్లో పింఛను జాబితాలు ఇష్టానుసారంగా రూపొందించారు. బొట్టు చెరగకుండానే పుణ్య స్త్రీలను వితంతువులుగాను, కులం పేరులో మార్పులు చేసి పచ్చ చొక్కాలు ధరించిన వారికి పింఛన్లు మంజూరు చేశారు. ఎంతో మంది అర్హులు పింఛను కోసం కాళ్లరిగేలా కార్యాలయాలు చుట్టూ తిరిగినా వారికి భరోసా కనిపించడం లేదు. తాజాగా గొల్లప్రోలు నగర పంచాయతీలో పింఛను మంజూరులో భారీ ఎత్తున అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో భాగంగా పలు అవకతవకలు బయటపడ్డాయి. గొల్లప్రోలు విశాల వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్‌ కొల్లి సత్యవతికి భర్త సూర్యారావు బతికుండగానే వితంతు పింఛను (ఐడీ నెంబరు 104828101) మంజూరు చేశారు. అదే విధంగా 10వ వార్డులోని కాపు సామాజికవర్గానికి చెందిన మర్రి వెంకట్రావుకు బీసీ చేనేత కార్మికునిగా (ఐడీనెంబరు–104832404), 19వ వార్డు కాపు సామాజిక వర్గానికి చెందిన రాశంశెట్టి దొంగబ్బాయి బీసీ చేనేత కార్మికునిగా (ఐడీ నెంబరు–104836671) పింఛను మంజూరు చేశారు. పట్టణానికి చెందిన ఆరుగురు చేనేత కార్మికులకు పింఛను మంజూరు కాగా ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారిని చేనేత కార్మికులుగా గుర్తించి పింఛను మంజూరు చేయడం విశేషం. వాస్తవానికి పలువురు వయసు తక్కువ ఉన్న వారిని ఆధార్‌కార్డులో వయసు ఎక్కువగా ఉన్నట్టు మార్పులు చేయించుకుని పింఛను కేటాయించారు. పింఛను మంజూరులో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top