రాజధాని భూసమీకరణకు అధికారులు 10 గ్రామాల్లో కలెక్టర్ కాంతీలాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర గ్రామాల్లోల్లో భూసమీకరణకు కలెక్టర్ కాంతీలాల్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు భూసేకరణకు సిద్ధమయ్యారు. నూతనంగా ప్రకటించిన రాజధాని ప్రాంతంలోని తొలి విడత 10 గ్రామాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల అయింది. తుళ్లూరు, అనంతవరం, బోయపాలెం, పిచ్చుకలపాలెం, అబ్బురాజుపాలెం నేలపాడు, శాకమూరు, దొండపాడు, ఐనవోలు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
అదే విధంగా శనివారం మరో 19 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. భూసేకరణ విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ రైతులు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరసన తెలుపుతున్న రైతులకు అఖిలపక్ష నేతలు, రైతు సంఘాల నేతలు మద్దతు తెలిపారు.
మరోవైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం రైతులపై భూ సేకరణ అస్త్రం ప్రయోగించడంలో విపక్షాలు మండిపడుతున్నాయి. రైతులను భయపెట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. రైతుసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సీఆర్డీఏ ముందు రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.